కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కేంద్ర సహాయ మంత్రి, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వ్యవహారాల ఇంఛార్జి శ్రీ వి.మురళీధరన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో అగ్రస్థాయి నాయకులుగా శ్రీ మురళీధరన్ వెలుగొందడం ఆయనకు పార్టీతో ఉన్న అనుంబంధాన్ని వెల్లడిస్తోంది. ఏబీవీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీ మురళీధరన్.. కేరళ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక విజయాలు సాధించారు. పార్టీ నిర్మాణం, నూతన నాయకత్వం రూపకల్పనలో ఆయన చేసిన కృషి అభినందనీయం. కేరళ బీజేపీ శాఖకు ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆ రాష్ట్రంలో బీజేపీ ఓట్ల సంఖ్య ఆరు శాతం నుంచి పదిన్నర శాతానికి చేరుకోవడం ఆయన నాయకత్వానికి, ప్రతిభకు నిదర్శనం. కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా ఆయన చేస్తున్న సేవలు కొనియాడదగినవి. ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ఆయనలోని విలక్షణ లక్షణం. కలిసినప్పుడల్లా ఎంతో ఆత్మీయంగా మాట్లాడే శ్రీ మురళీధరన్ నిండు నూరేళ్లు వర్థిల్లాలని, ఆయనకు సౌభాగ్యవంతమైన ఆరోగ్యాన్ని, సుఖశాంతులను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.