మహిళా సాధికారితే జనసేన పార్టీ లక్ష్యం

*క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా పనిచేసే మహిళలకు పెద్దపీట
*ఒక్క ఏడాది కష్టపడితే విజయం మనదే
*పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి
*జనసేనాని
పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని రాష్ట్రం కోరుకుంటోంది
*జనసేన అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మేలు
*మంగళగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాదెండ్ల మనోహర్

మహిళలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారితే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను నయానో భయానో ఏకగ్రీవం చేసుకోవాలన్న అధికార పార్టీ కుట్రలను భగ్నం చేసి, జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆనాడు ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి పోరాడింది మహిళలేనన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా కడ వరకు వాళ్లు చేసిన పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “ మహిళల ప్రాంతీయ కమిటీలు వేశాక జరుగుతున్న తొలి సమావేశం ఇది. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు రీజనల్ కమిటీలు వేశాం. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా – పెన్నా, రాయలసీమ రీజనల్ కమిటీలను ఇప్పటి వరకు ఏర్పాటు చేశాం. తర్వలోనే జిల్లా, మండల, గ్రామ కమిటీలను కూడా నియమిస్తాం. క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా పనిచేసే మహిళలను గుర్తించి రీజనల్, జిల్లా కమిటీల్లో నియమించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దానికి అనుగుణంగా కమిటీల్లో స్థానం కల్పిస్తాం.
*అధికార పార్టీ అబద్ధాలను ఎండగట్టాలి
తమది సంక్షేమ ప్రభుత్వమని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. వారి సంక్షేమం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది తప్ప… క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరడం లేదు. మత్స్యకారుల సమస్యల అధ్యయనానికి ఇటీవల తీర ప్రాంతాల్లో పర్యటిస్తే అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అర్హులైన చాలా మంది మహిళలకు పెన్షన్లు అందడం లేదు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వేటకు వెళ్లి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ తీరును ఎండగట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలపై వీర మహిళ విభాగం క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలి. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి, ఒక మీడియా సమావేశానికే పరిమితమైతే ప్రభావం చూపలేము.
*రాజకీయాల్లో ఓర్పు కావాలి
సోషల్ మీడియాలో కించపరిచారనో, అవమానించారనో డీలా పడిపోవద్దు. రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్లాలంటే ఓర్పు చాలా అవసరం. బీఎస్పీ అధినేత్రి మాయవతి గారిని ఆదర్శంగా తీసుకోండి. పార్టీ గెలుపు కోసం ఆమె ఉత్తరప్రదేశ్ లోని ప్రతి గ్రామం కాలినడకన తిరిగారు. డోర్ టూ డోర్ కార్యక్రమాలు చేపట్టారు. అమరావతి మహిళా రైతులు అయితే దాదాపు 810 రోజులు ఉద్యమం చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. అవమానాలు భరించారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం కేసులు కూడా ఎదుర్కొన్నారు. వీళ్లను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి వీర మహిళ విభాగం వంటి విభాగం లేదు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు, పార్టీకి మంచి పేరు తెచ్చేలా ధైర్యంగా ముందుకు దూసుకెళ్లండి. వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు మహిళల గురించి ఎవరూ మాట్లాడరు. కానీ 80 శాతం మంది వ్యవసాయ కూలీలు మహిళలే. దానిని మనం గర్వంగా చెప్పుకోవాలి. మన దేశ రెవెన్యూ చూస్తే 73 శాతం వ్యవసాయం నుంచే వస్తుంది.
*ఆవిర్భావ సభలో అతివలకు ప్రత్యేక ఏర్పాట్లు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు చక చక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధ్యక్షుల వారి సూచనల మేరకు సభా ప్రాంగణంలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్లకు సపరేట్ గా సీటింగ్ తో పాటు ఇన్ అండ్ ఎగ్జిట్ సపరేట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి కట్టుబడి వీరమహిళ విభాగం ముందుకు వెళ్లాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తేసే మేలు జరుగుతుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. అధ్యక్షుల వారిని బలపరిచేలా మనం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేద్దాం. కేవలం ఒక్క సంవత్సరం కష్టపడి సమష్టిగా పనిచేస్తే చాలు.. మనం కోరుకునే నాయకుడిని అధికార పీఠంపై నిలబెట్టవచ్చని” అన్నారు.
* మహిళా రైతులకు సత్కారం
అంతకు ముందు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. స్ఫూర్తి ప్రధాతలైన మహిళా మణులు…. ఆంధ్రుల అన్నపూర్ణమ్మ శ్రీమతి డొక్కా సీతమ్మ, సెయింట్ మథర్ థెరీసా, శ్రీమతి సావిత్రిబాయి పూలే, శ్రీమతి ఝాన్సీలక్ష్మీ బాయిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీమతి అనూషానాయుడు బృందం కూచిపూడి నృత్యం ఆహుతులను అలరించింది. అమరావతి రాజధాని ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న మహిళా రైతులు శ్రీమతి నంబూరి రాజ్యలక్ష్మి, శ్రీమతి కొవ్వాడ అన్నపూర్ణ, ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు శ్రీమతి బండమూడి సుమతిలను జనసేన పార్టీ వీర మహిళా విభాగం సత్కరించింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీమతి ఘంటా స్వరూప, శ్రీమతి పొలాసపల్లి సరోజ, శ్రీమతి ప్రియా సౌజన్య, సంయుక్త కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత, శ్రీకాళహస్తి ఇంఛార్జ్ శ్రీమతి కోట వినూత, వీరమహిళా విభావం రీజనల్ కమిటీ సభ్యులు శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీమతి కడలి ఈశ్వరి, శ్రీమతి చల్లా లక్ష్మి, శ్రీమతి షేక్ మొహమ్మద్ హసీనా బేగమ్ తదితరులు పాల్గొన్నారు.