రైతుల నిరసనపై అమిత్‌షాతో పంజాబ్‌ సిఎం భేటి

నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ గురువారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ, చుట్టుపక్కల రైతులు చేస్తున్న ఆందోళనలు పంజాబ్‌ ఆర్థిక వ్యవస్థను మాత్రమే ప్రభావితం చేయవని, దేశ భద్రతను కూడా ప్రభావితం చేస్తాయని అన్నారు. రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్రం మధ్య చర్చ జరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించడానికి తన చేతుల్లో ఏమీ లేదని అన్నారు. హోంమంత్రితో జరిగిన సమావేశంలో చట్టాలపై వ్యతిరేకతను పునరుద్ఘాటించానని, ఇది ఒక్క పంజాబ్‌ ఆర్థిక వ్యవస్థనే కాదు దేశ భద్రతను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయనను అభ్యర్థించానని అన్నారు.