పెన్షన్ టెన్షన్‌!.. రేషన్‌ పరేషాన్‌!!.. సయ్యద్ నాగుర్ వలి

  • పేదల గుండెల్లో రైళ్లు
  • లక్షలాది రేషన్‌ కార్డుల రద్దు
  • పింఛన్ల నిలిపివేతతో గగ్గోలు
  • దిక్కుతోచని వృద్ధులు, వికలాంగులు
  • కన్నీరు మున్నీరవుతున్న మహిళలు
  • దశాబ్దాలుగా వచ్చే పెన్షన్లూ స్టాప్‌
  • మొండిగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం

జనసేన పార్టీ నకరికల్లు మండలం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా కేకు కోయడం సంతోషమే.. ఆ సందర్భంగా 2.5 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేయడం కూడా ఆనందమే.. అదే సమయంలో కేకు కోసినంత సులువుగా జగన్‌ ప్రభుత్వం మరో రెండు కోతలు కోసింది.. అవేంటో తెలుసా?,
దాదాపు 4 లక్షల పింఛన్లకు కోత!, 15 లక్షల రేషన్‌ కార్డులకు కూడా కోత!, ఆ రెండు నిర్ణయాలూ పేదల గుండెకోతగా మారాయి. ఏ ఆసరా లేని వృద్ధుల, వికలాంగుల, వితంతవుల ఆశలకు కోత పెట్టాయి.. బియ్యం అందించే రేషన్‌ కార్డులను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడుగు జీవుల పొట్టకొడుతోంది. ఉన్నట్టుండి రేషన్‌ కార్డులను రద్దు చేస్తే ఎలాగంటూ పేదలు లబోదిబోమంటున్నారు. ఇక దశాబ్దాలుగా పింఛన్‌ అందుకుంటున్న వృద్ధులు ఉన్నపళంగా ప్రభుత్వ సాయాన్ని ఆపేస్తే ఎలాగంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామ సచివాలయం దగ్గరకైనా వెళ్లి చూడండి.. ఎలాంటి ఆసరాలేని వృద్ధులు కన్నీటితో తమ పింఛన్‌ ఎందుకు ఆగిపోయిందంటూ అడుగుతున్న దృశ్యాలు కనిపిస్తాయి.
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు జాలిగా తమ పెన్షన్‌ ఆగిపోయిందంటూ గోడు పెడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరి దగ్గర చూసినా వృద్ధులు, మహిళలు వాపోతున్న సన్నివేశాలు కనిపిస్తాయి.
ప్రభుత్వం నెలనెలా అందించే బియ్యంతోనే కడుపు నింపుకుంటున్నామంటూ గగ్గోలు పెడుతున్న పేదల విన్నపాలు వినిపిస్తాయి. కేంద్రం ఇచ్చే రేషన్‌ సరుకులను కూడా అందుకోనివ్వకుండా కార్డులను రద్దు చేస్తే ఎలాగంటూ ఉక్రోషంతో అడిగే ప్రశ్నలు వినిపిస్తాయి. కానీ… ఈ విన్నపాలకు కానీ, వేదనలకు కానీ, కన్నీటి వేడికోళ్లకు కానీ, ప్రశ్నలకు కానీ సమాధానం సచివాలయం అధికారుల నుంచి సచివుల వరకు ఎవరి దగ్గర లేదు. అర్హులైన వారికి ప్రభుత్వ సాయం అందకుండా ఉండకూడదు. అనర్హులకు మాత్రం సాయం అందకూడదు…” అనే ఊకదంపుడు ఉపమానాలు చెబుతూ ముఖ్యమంత్రి నుంచి స్థానిక నేతల వరకు సమర్దించుకోవడం మాత్రం కనిపిస్తోంది. నిజమే… రేషన్‌కార్డుల లబ్దిదారుల్లో కానీ, పింఛన్‌ అందుకుంటున్న వారిలో కానీ అనర్హలు ఉండకూడదనేది అందరూ అంగీకరించే విషయమే. కానీ అలాంటి వారి ఏరివేత ప్రక్రియలో నిజమైన పేదలు, వృద్ధులు కూడా ఉండకూడదనేది కూడా ఎవరూ కాదనలేని నిజం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోందని క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలుతోంది. శారీరకమైన లోపంతో బతుకును భారంగా ఈడుస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వ సాయమే భరోసా. అలా దశాబ్దాలుగా పింఛన్‌ అందుకుంటున్న దివ్వాంగులందరూ, ఇప్పుడు మళ్లీ తమ వైకల్యాన్ని నిరూపించే డాక్టర్‌ సర్టిఫికెట్‌ చూపించాలని నిబంధన విధించడమే అమానుషంగా కనిపిస్తోంది. ఎప్పుడో ఇరవై ఏళ్లు, పదేళ్ల నాటి వైద్య నిరూపణ పత్రాలను ఉన్నట్టుండి ఇప్పుడు చూపించమంటే ఎలాగంటూ కన్నీళ్లతో వేడుకుంటున్న వికలాంగుల వేదన అరణ్యరోదనగా మిగులుతోంది. పింఛన్‌ 200 రూపాయలుగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వ సాయం అందుకుంటున్నాం. ఇప్పుడు మా అర్హతను మళ్లీ నిరూపించుకోవాలంటే ఎలా? అంటూ కన్నీరుమున్నీరవుతూ ప్రశ్నిస్తున్న వృద్ధులు, మహిళలు ప్రతి గ్రామంలోను కనిపించడమే.. ఏరివేత ప్రక్రియలో వెనకా ముందూ చూసుకోకుండా, ఏవేవో కొత్త నిబంధనలతో ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతోందనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

చెప్పేదొకటి… చేసేదొకటి…

రాష్ట్రంలో 80 శాతం మంది తెల్ల రేషన్‌ కార్డులపై బతుకుతున్నారు” అంటూ ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, మేం ప్రతి ఆరు నెలలకోసారి కొత్త కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తాం అంటూ కూడా చెప్పుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
తాజాగా 2.5 లక్షల కొత్త పింఛన్లను, సుమారు 58,000 రేషన్‌ కార్డులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వార్డు, గ్రామ సచివాలయాలకు కొత్త జాబితాలు అందాయి. అయితే వాటితో పాటు రద్దు చేసిన పింఛన్‌, కార్డు లబ్దిదారుల జాబితాలు కూడా అందాయి. వాటిని పరిశీలించినప్పుడు వార్డు సచివాలయాల పరిధిలో 15 శాతం మంది, గ్రామ సచివాలయాల పరిధిలో 10 శాతం మంది లబ్ధిదారుల పేర్లు రద్దు అయ్యాయని తేలుతోంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు దాదాపు 4 లక్షల మంది పింఛను దారులు, 15 లక్షల మంది కార్డు దారులు ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నారని స్పష్టమవుతోంది. జగన్‌ ప్రభుత్వం కొలువు దీరి ఇప్పటికి మూడున్నరేళ్లు దాటుతోంది. ఏరివేత కార్యక్రమం కానీ, అందుకు దీటైన నిబంధనల అమలు కానీ మొదట్లోనే జరగాల్సి ఉంది. ఇప్పుడు ఇన్నాళ్లుగా లేని అభ్యంతరాలు కొత్తగా ఎందుకు వచ్చాయనేదే ప్రధానమైన ప్రశ్నగా నిలుస్తోంది. గతంలో రాష్ట్రంలో 1.57 కోట్ల రేషన్‌ కార్డులుండేవి. జగన్‌ ప్రభుత్వం కొలువుదీరగానే దాదాపు 18 లక్షల రేషన్‌కార్డులను తొలగించారు. తిరిగి అంచెల వారీగా కొత్త బియ్యం కార్డులు జారీ చేయడంతో వాటి సంఖ్య ప్రస్తుతానికి 1.45 కోట్లుగా ఉంది. పింఛన్ల విషయానికి వస్తే ఏటా పింఛన్‌ మొత్తాన్ని పెంచుతామంటూ జగన్‌ చెప్పుకొచ్చారు. అలాగే రేపు రాబోయే జనవరి నుంచి పింఛన్‌రూ.2500 నుంచి రూ.2750కి పెరగాల్సి ఉంటుంది. ఓ పక్క పింఛన్ పెరుగుతుందనే ఆనందంలో ఉన్న లక్షలాది లబ్దిదారులకు ఇప్పుడు పింఛన్ల జాబితాలో కోతలు కలవరపెడుతున్నాయి. ఏదైనా సాయాన్ని పెంచాలంటే ఉన్న లబ్దిదారుల్లో కోత విధించడమే మార్గమనే పంథాలో ప్రభుత్వం సాగుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జగన్‌ ప్రభుత్వం పైకి సాయం పెంచుతున్నట్టు ప్రకటనలు చేస్తూనే, ఏవేవో ఆంక్షలతో ఉన్న లబ్దిదారుల సంఖ్యను భారీగా తగ్గిస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా సాగుతున్న జగన్‌ ప్రభుత్వ నిర్ణయంపై పింఛన్లు, కార్డులను కోల్పోయిన లబ్దిదారులు ఉద్యమిస్తున్న దృశ్యాలు, నిరసన ప్రదర్శనలకు దిగుతున్న సన్నివేశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి.

పొంతన లేని నిబంధనలు..

కార్డులు, పింఛన్ల అమలుకు ప్రభుత్వం ఆరంచెల వడపోత విధానాన్ని అమలు చేస్తోంది. అందుకు కొన్ని ఆంక్షలు,
నిబంధనలు సైతం విధించింది. ఉదాహరణకు లబ్ధిదారుల నివాస స్థలం 1000 చదరపు అడుగులకు మించి ఉండకూడదు. అలాగే నెలకు వాడే కరెంటు బిల్లు 300 రూపాయలకు మించి ఉండకూడదు. ఇంకా లబ్ధిదారుల కుటుంబంలో ఎవరూ పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. అలాగే కుటుంబంలో ఎవరూ సొంత కారు కలిగి ఉండకూడదు. ఆదాయపు పన్ను కట్టకూడదు. ఇలాంటి మరికొన్ని నిబంధనల నేపథ్యంలో వాలంటీర్లతో సర్వే జరిపించారు. ఆ సర్వే ఆధారంగా నోటీసులు జారీ చేసి కార్డులను, పింఛన్లను కూడా నిలిపివేశారు. అయితే ఆయా నిబంధనల నేపథ్యంలో వాస్తవిక పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో అనేక తప్పులు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వాలంటీర్లు ఇష్టారాజ్యంగా వివరాలు నమోదు చేశారని, ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరులని ఏమాత్రం అనుమానించినా తప్పుడు సమాచారంతో పేర్లు రద్దు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి అవకతవక సర్వేల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది పింఛను దారులకు నోటీసులు జారీ చేశారు. కేవలం 15 రోజుల్లో వారి అర్హతను నిరూపించుకోకపోతే పింఛను రద్దు చేస్తామని చెప్పడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వింతతవులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల్లో ఉన్న లొసుగులను లబ్దిదారులు ప్రతి చోట ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు చేనేత లబ్దిదారుల ఆవేదనను పరిశీలించినప్పుడు… ఒక మగ్గం ఉండాలంటేనే దాదాపు 600 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంది. అలాంటప్పుడు వెయ్యి చదరపు అడుగులకు మించిన నివాసం ఉంటే ప్రభుత్వ సాయాన్ని రద్దు చేయడం ఎంత వరకు సమంజసమంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే పేదవాళ్లు ఎలాగోలా డబ్బులు కూడదీసుకుని ఉన్న ఇంటిని డాబాగా మార్చుకుంటే, ఆ డాబా స్థలం వైశాల్యాన్ని కూడా అదనంగా కలిపి వెయ్యి చదరపు అడుగులకు మించిందంటూ లబ్దిని రద్దు చేశారనే ఆక్రోశనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక వృద్ధులు తమ కూతురి దగ్గరో, కొడుకు దగ్గరో ఉండడం సహజం. ప్రభుత్వ సాయం వారి మందులకు, ఖర్చులకు ఊతంగా నిలుస్తుంది. అయితే ఎవరి దగ్గరో ఉంటున్నారనే సాకుతో లబ్దికి దూరం చేసిన ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. వృద్ధుల మనవడో, మనవరాలో పట్నంలో ఉద్యోగం చేస్తూ ఏదైనా వాహనం కొనుక్కున్నా, ఆ కుంటుంబంలోని వృద్ధుల పింఛన్‌ రద్దు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
అవకతవకలుగా, తప్పుల తడకగా, మొక్కుబడిగా వాలంటీర్ల ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో నమోదైన వివరాలలో తప్పులను ఎత్తి చూపుతూ వాపోతున్న బాధితుల గోడు వినిపించుకునే నాధుడే కరువయ్యారు. కొందరికి విద్యుత్‌ మీటర్లు లేకపోయినా ఉన్నట్టు, ఆస్తులు లేకపోయినా ఉన్నట్టు కారణాలు చూపుతూ జారీ చేసిన నోటీసులను చూసి పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు ఒక్కొక్కరి పేరిట వేలాది భూములు ఉన్నట్టు నమోదు చేశారు. నిజానికి వారంతా ఎలాంటి ఆస్తులు లేని పేదవారే కావడం విచిత్రం. అలాగే పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే పింఛనుదారుకి ఏకంగా 158 ఎకరాలు ఉన్నట్టు చూపారంటే… వాలంటీర్ల సర్వే ఎంత ఘోరంగా జరిగిందో అర్థమవుతోంది. ఆ వివరాలు చూపిస్తూ రామక్క పడుతున్న ఆవేదనను పట్టించుకునే వారెవరూ కనిపించడం లేదు. మీ తమ్ముడికి ఉద్యోగం ఉందంటూ ఓ వితంతువుకి పింఛన్‌ ఆపేశారు. మీ బంధువుల్లో ఒకరికి కారుందంటూ మరొకరికి రద్దు చేశారు. ఇలా ప్రతి గ్రామం పరిధిలోను పింఛన్లు కానీ, రేషన్‌ కార్డులు కానీ కోల్పోయిన బాధితులలో అత్యధికుల వివరాలలో తప్పులు దొర్లాయని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. అయితే ఈ అభ్యంతరాలేమీ పట్టించుకోకుండా జగన్‌ ప్రభుత్వం మొండిగా ముందుకు సాగుతోంది.

ఆర్థిక సంక్షోభమే అసలు కారణం..

రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనేది కాదనలేని వాస్తవం. ఎక్కడ ఎలాంటి వెసులుబాట్లు ఉన్నా వాటన్నింటినీ ఉపయోగించుకుని అందిన చోటల్లా లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తెస్తేనే జీతాలు కానీ, పింఛన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ కొనసాగించలేని పరిస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో పింఛన్ల మొత్తాన్ని పెంచాలన్నా, కొత్త పింఛన్లు ఇవ్వాలన్నా, కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలన్నా ప్రభుత్వం ముందు ఉన్న మార్గం ఒక్కటే. ఏదో సాకు చూపించి లబ్దిదారుల సంఖ్యను తగ్గించడమే. ప్రస్తుతం ప్రభుత్వం అదే చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాది సంక్షేమ ప్రభుత్వం అంటూ పదే పదే ప్రచారం చేసుకునే జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు సంక్షోభాల ప్రభుత్వంగా మారిందనే విమర్శలు అన్నివర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయని సయ్యద్ నాగుర్ వలి తెలిపారు.