ర్యాలీలో వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ

  • రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ
  • పేద ప్రజల కోసం ప్రాణాలను సైతం అర్పించిన జననేత అని కొనియాడిన ఆకుల రామకృష్ణ
  • పాల్గొన్న పలు పార్టీల నాయకులు, అభిమానులు
  • రాధకు ఘన స్వాగతం పలికిన యువత
  • ప్రతీ పేదవాని గుండెల్లో కొలువైన ఆరాధ్యదైవం రంగన్న
  • జనసంద్రం నడుమ వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించిన రంగా తనయుడు రాధాకృష్ణ
  • పాల్గొన్న పలు పార్టీల నాయకులు, అభిమానులు, కాపు నేతలు జనంతో కిక్కరిసిపోయిన గ్రామం
  • ప్లకార్డులతో వంగవీటికి అడుగడుగునా పువ్వులతో ఘన స్వాగతం పలికిన అభిమాన యువత

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం పరిధిలోని ర్యాలి గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని బుధవారం రాత్రి ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ చేతులు మీదుగా
ఆవిష్కరించారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కాపు ఉద్యమ నేత సీనియర్ రాజకీయ నేత ఆకుల రామకృష్ణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బండారు శ్రీనివాస్, బీజేపీ కొత్తపేట నియోజకవర్గ కన్వీనర్ సలాది రామకృష్ణ తదితరులతో కలిసి ఆయన స్వర్గీయ మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలువురు నేతలు రాధకు దుశ్వాలను కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభలో వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా అన్నారు. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత రంగాకు మాత్రమే దక్కుతుందన్నారు. రంగా చనిపోయి 34 ఏళ్ళయినా ఇప్పటికీ అందరి గుండెల్లో ఆయన రూపం కొలువై ఉందన్నారు. రంగాతో విడదీయరాని అనుబంధం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు ఉద్యమ నేత సభా వేదిక అధ్యక్షుడు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన మహా నాయకుడు జననేత వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజానీకానికి ఇళ్ల స్థలాలను ఇప్పించేందుకు ఆనాడు కార్మికులకు అండగా నిలిచి ఆమరణ నిరాహార దీక్షకు పునుకుని జనం కోసం వంగవీటి తుది శ్వాస విడిచారన్నారు. ఎమ్మెల్సీ తోట, మాజీ ఎమ్మెల్యే బండారు, కొత్తపేట నియోజకవర్గ జనసేన, బీజేపీ ఇంఛార్జీలు శ్రీనివాస్, సలాది మాట్లాడుతూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మంచి మనిషి రంగానే అని అన్నారు. ఆయన మన మధ్య లేకపోయిన ప్రజల్లో హృదయాల్లో జీవించే ఉన్నారన్నారు. నేటి యువత వంగవీటిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్, మద్దుల సుబ్బారావు, బండారు సుబ్రహ్మణ్యం(బాబీ), జవ్వాది రవి, చల్లా ప్రభాకరరావు, ముత్యాల బాబ్జి, నందం వీర వెంకట సత్యనారాయణ, ఆకుల భీమేశ్వరరావు, ముత్యాల వీరభద్రరావు, సాధనాల శ్రీనివాస్, తోట స్వామి, రాచకొండ సతీష్, నంబు రవికుమార్, అంబటి మణికంఠ, అభిమానులు, కాపు నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.