ఏలూరు వింత వ్యాధికి కారణం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరాన్ని అంతుపట్టని వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సంగతి విదితమే. గత మూడు రోజుల వ్యవధిలోనే 300 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. అయితే ఈ వింత వ్యాధి ఘటనలో విష తుల్యమైన ఆర్గానో క్లోరైన్ ఆనవాళ్లను నిపుణులు గుర్తించినట్టు సమాచారం. మరిన్ని పరీక్షలు చేపడితే వ్యాధి కారణాలపై స్పష్టత వస్తుందంటున్నారు నిపుణులు. వ్యాధి కారణాలు మరింతగా తెలుసుకునే క్రమంలో ఎన్ఐఎన్, ఐఐసీటీ బృందాలు ఏలూరు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు 22 ప్రాంతాల్లో నీటి శాంపిళ్లను సేకరించారు. అయితే వాటిలో ఎటువంటి లోపాలు లేవని నిర్ధారణ అయ్యింది. మరో వైపు ఈ-కోలి టెస్టుల ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.

52 మంది రక్తం నమూనాల సేకరించగా, ఫలితాలు నార్మల్ గా ఉన్నాయి. 42 మందికి బ్రైన్ సీటీ స్కాన్ నిర్వహించగా, ఫలితాలు నార్మల్ గా ఉన్నాయి. ఏలూరు ఘటనలో మొత్తం 275 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 270, ప్రైవేట్ ఆస్పత్రిలో 5గురికి చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఏడుగురిని విజయవాడకు తరలించారు. ఇప్పటి వరకు 119 మంది బాధితులు డిశ్చార్జ్ అవ్వగా, మరో 30 బాధితులు డిశ్చార్జ్ కు సిద్ధంగా ఉన్నారు.

ఏలూరు వింత వ్యాధి ఘటనలో 270 కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని ప్రకటించారు. ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించామన్నారాయన. ఇప్పటి వరకు 117 మంది డిశ్చార్జయ్యారని, మరో 30 మంది డిశ్చార్జ్‌కు సిద్ధంగా ఉన్నారని ఆళ్ల నాని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని టెస్టులు చేసినా నార్మల్ వస్తుందని, రేపు మరికొన్ని టెస్టులు నిర్వహిస్తామన్నారాయన.