తుపాను బాధిత రైతులకు న్యాయం కోరుతూ జనసేనాని నిరసన దీక్ష

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు కనీస నష్టపరిహారం చెల్లిస్తే కాస్త ఊపిరి తీసుకొంటారని.. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొనేందుకు పరిహారంగా రూ.35 వేలు, తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 48 గంటలు సమయం ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ… రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపునిచ్చారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు  హైదరాబాద్ లోని తన నివాసంలో ఉదయం పది గంటలకు దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నివర్ తుపాన్ వల్ల దాదాపు 17 లక్షల పైచిలుకు ఎకరాల్లో ఊహించని పంట నష్టం జరిగింది. నాలుగు రోజులపాటు నాలుగు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి రైతు ఆవేదనతో ఉన్నారు. ‘ఇప్పటికే కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయాం. ఈ ఏడాది వరుసగా మూడు ప్రకృతి విపత్తులు సంభవించడంతో చేతికొచ్చే దశలో పంటలు నీటిపాలయ్యాయి’ అని చెప్పారు. ఎకరా పంట పెట్టుబడి రూ. 50 వేలు వరకు అవుతుంది. కనీసం నష్టపరిహారంగా రూ. 35 వేలు ఇస్తే ఊపిరి పీల్చుకోగలమని రైతులు తెలిపారు. అందుకే జనసేన పార్టీ తరపున పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 35 వేలు ఇవ్వాలని, తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాం.ఇప్పటి వరకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాలిపోయిన వరి పనలు తీయడానికి కూడా డబ్బులు లేక నిరాశ, నిస్పృహలతో చనిపోయారు. కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోయారు.  అందుకే తక్షణ సాయం కోరాం.

మద్యం ద్వారా వచ్చిన వేల కోట్ల ఆదాయాన్ని నష్టపరిహారంగా

మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అవసరం లేదని పదేపదే చెప్పారు.  మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేస్తామన్నారు. నిషేధం మాట పక్కనపెడితే అమ్మకాలను మాత్రం ప్రోత్సహిస్తున్నారు. సుమారు రూ.16,500 కోట్లు ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది.  మద్యం మీద ఆదాయం అవసరం లేదని చెప్పిన మీరు.. మద్యం ద్వారా వచ్చిన ఆ వేల కోట్ల ఆదాయాన్ని పంట నష్టపోయిన రైతులకు కేటాయించాలని కోరుతున్నాం. అలా చేస్తే ఎకరాకు రూ. 35 వేలు నష్టపరిహారం ఇవ్వడం ఇబ్బంది కాదు. చావుబతుకుల్లో ఉన్న రైతాంగానికి ఊపిరి పీల్చుకునే పరిస్థితులు రావాలన్నా, రైతు ఆత్మహ్యతలు ఆగాలన్నా తక్షణమే రూ. 10 వేలు ఇవ్వాలి.  

దీక్షతో జైకిసాన్ కు శ్రీకారం

రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలన్నదే జనసేన ప్రయత్నం. దాని కోసమే జైకిసాన్ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. వ్యవసాయ శాస్ర్తవేత్తలు, వ్యవసాయ సంఘాలతో చర్చించి పాలసీని రూపొందిస్తాం. దీనిని ఒక ప్రాధాన్య కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం. ఈ దీక్షతో జైకిసాన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వాలు ఎంతోకొంత నష్టపరిహారం అందిస్తున్నాయి. కౌలు రైతులను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. భూ యజమాని నష్టపోకుండా కౌలు రైతులను ఎలా ఆదుకోవాలన్న దానిపై ప్రభుత్వం లోతుగా ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలి. రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. ప్రతి జనసైనికుడు, నాయకులు,ప్రజలు అన్నంపెట్టే అన్నదాతకు మద్దతు ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.