కేశినేనికి చెక్ పెట్టేందుకే గుంటూరు అభ్యర్ధిగా కోవెలమూడి రవీంద్ర

మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో విజయవాడ రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంలో వర్గ విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఎంపీ కేశినేని నానికి చెక్ పెట్టే దిశగా రాజకీయాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తూ పార్టీ అధినేతే వ్యూహం కదుపుతున్నట్టు సమాచారం.

ఏపీలో మున్సిపల్ పోరు కు నగారా మోగగానే రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక లకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంలో విర్గ విబేదాలు తెరపైకి వస్తున్నాయి. విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్ధిత్వం విషయంలో ఎంపీ కేశినేని నాని వర్సెస్ ఆయన వ్యతిరేకవర్గం మధ్య ఘర్షణ పెరుగుతోంది. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా తన కుమార్తె శ్వేతను ఖరారు చేయాలని ఎంపీ కేశినేని నాని పట్టుబడుతుంటే..ఆయన వ్యతిరేకవర్గం అడ్జు తగులుతోంది. ముఖ్యంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, దేవినేని ఉమ, బొండా ఉమ, వర్ల రామయ్య, పట్టాభి వర్గాలు కేశినేని నానికి ఎప్పుడూ వ్యతిరేకమే. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో విబేధాల్నీ ఒక్కసారిగా తెరపైకొచ్చాయి. అందరూ కలసి మెలసి పనిచేయాలని అచ్చెన్నాయుడు సూచించారే తప్ప..మేయర్ అభ్యర్ధిగా కేశేనేని కుమార్తె పేరును ప్రకటించలేదు.

దీనికి తోడు కేశినేని నాని  స్వరం అధిష్టానాన్ని ధిక్కరించేరీతిలో ఉంటోందని ఇటీవలి కాలంలో ఫిర్యాదులు అందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా నానికి చెక్ పెట్టేందుకే వ్యూహం పన్నుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే గుంటూరు మేయర్ అభ్యర్ధిగా కోవెలమూడి రవీంద్ర పేరును టీడీపీ అధికారికంగా ప్రకటించింది. ఇక ఇదే రాజధాని ప్రాంత పరిధిలోని విజయవాడ మేయర్ అభ్యర్ధిగా కేశినేని నాని కోరిక మేరకు అతని కుమార్తె శ్వేత పేరును ప్రకటిస్తే సామాజికవర్గం అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది నాని వ్యతిరేక వర్గం. విజయవాడ, గుంటూరు రెండు ప్రాంతాలకు ఒకే సామాజికవర్గాన్ని ఎలా ఎంపిక చేస్తారంటూ కేశినేని నాని వ్యతిరేక వర్గం వాదిస్తోంది. వర్గాల మాట ఎటున్నా ఒకే సామాజికవర్గానికి ఇవ్వడమనేది రాజకీయంగా సరైంది కాదు. అలాగని ఇప్పటికే అధికారికంగా ప్రకటించినందున గుంటూరు విషయంలో మార్పు రాదు. సో.. కేశినేని నాని కుమార్తె శ్వేతకు మేయర్ అభ్యర్ధిత్వం అనేది జరగని పనిగా రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. అంటే కేశినేని నానికి చెక్ పెట్టేందుకే చంద్రబాబు సూచనల మేరకు నాని వ్యతిరేకవర్గం పావులు కదుపుతోంది. సామాజికవర్గం సాకు చూపించి కేశినేని నానికి చెక్ పెట్టేందుకే గుంటూరు అభ్యర్ధిగా కోవెలమూడి రవీంద్ర పేరును ప్రకటించారనే వాదన విన్పిస్తోంది.