తిరిగి బీజేపీ గూటికి చేరిన నటి విజయశాంతి

సీనియర్ నటి, కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి కాంగ్రస్ ను వీడి తిరిగి బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో విజయశాంతి పార్టీలోకి విజయశాంతి చేరారు. కీలక నేత అరుణ్‌ సింగ్‌ కాషాయ కండువాను కప్పి సినీ నటిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కే లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన అనంతరం నటి విజయశాంతి మాట్లాడారు. గతంలో 1998 జనవరి 26న తాను బీజేపీలో చేరానని గుర్తుచేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ సానుకూలంగా స్పందించడం లేదని పార్టీని వీడినట్లు తెలిపారు. బీజేపీ విధివిధానాలు తనకు ఏనాడు అడ్డంకి కాలేదని, అందుకే మరోసారి పార్టీ గూటికి తిరిగి వచ్చానని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీతోనే మార్పు సాధ్యమని తాను నమ్ముతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.

అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేటి ఉదయం ఉదయం 11 గంటలకు విజయశాంతి బీజేపీలో చేరాల్సి ఉంది. ఈ మేరకు ఇదివరకే హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ కీలక నేతలను ఆమె ఆదివారం కలుసుకున్నారు. వాస్తవానికి నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో నటి విజయశాంతి పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సి ఉండగా.. ఆయన పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. దీంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ నటి విజయశాంతికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.