మైలవరం జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

మైలవరం : పుల్లూరు గ్రామపంచాయతీ, భాడవ గ్రామంలో ఇటీవల కాలంలో వేగంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయి.. విషయం గ్రహించిన జనసైనికులు గ్రామ సచివాలయం దృష్టికి తీసుకువెళ్లగా అధికారులు, గ్రామ సర్పంచ్ స్పందించి శనివారం ఉదయం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసి, బ్లీచింగ్ చల్లడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మైలవరం మండల జనసేన అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య ఉదయం గ్రామంలో పర్యటించి.. ఇటీవల కాలంలో సుమారు 100మంది వరకు టైఫాయిడ్ బారిన పడ్డారని, కొద్దిమందికి డెంగ్యూ లక్షణాలు కూడా ఉన్నాయని మెడికల్ క్యాంపులోని అధికారులతో చర్చించగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ గతంలో కొద్దిపాటి వర్షానికి సైతం గ్రామంలో ఉన్న మరుగునీరు, వర్షపు నీరు పల్లపు ప్రాంతంలో ఉన్న మంచి నీటి ట్యాంకును సగానికి పైగా ముంచి వేస్తున్నాయని, పైపు లీకేజీలు గ్రామంలో ఎక్కువగా ఉన్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరగా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని, ఇది శోచనీయమని అభిప్రాయపడ్డారు. వెంటనే బాడవ గ్రామంలో మంచినీటి నూతన ట్యాంకును ఏర్పాటు చేసి, పైపులైను, డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు ఆనం విజయకుమార్, ఈతకొట్టు నాని మరియు జనసైనికులు పాల్గొన్నారు.