పార్లమెంట్ భవన నిర్మాణానికి భూమిపూజ.. భారతీయులు గర్వించదగ్గ శుభదినం

దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.  వేద పండితుల, వేదమంత్రాల మధ్య మధ్యాహ్నం 12.50 నిమిషాలకు పూజ చేశారు. భూమాత, కూర్మ, వరహారూప, నవగ్రహ, నవరత్న భరిత శిల పూజలు నిర్వహించారు. నవ కలశ స్థాపన తర్వాత శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. దాదాపు 200 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… ఇది 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ శుభదినం అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు.

ఢిల్లీలోని లుట్యెన్స్ జోన్‌లో రూ.20వేల కోట్ల వ్యయంతో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేయనున్నారు. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం,కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3కి.మీ రాజ్‌పథ్‌ పునరుద్దరణ చేపట్టనున్నారు. అలాగే పలు నూతన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించనున్నారు.