టైమ్‌ మ్యాగజైన్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2020 గా జో బైడెన్-కమలా హ్యారిస్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ టైమ్.. వీరిద్దరిని 2020 పర్సన్ ఆఫ్ ఇది ఇయర్‌గా ప్రకటించింది. మ్యాగజైన్‌ కవర్ పేజీపై బైడెన్, కమలా ఫొటోలను ముద్రించి Changing america’s story అని సబ్ టైటిల్ ఇచ్చారు.

డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులుగా పోటీపడిన జో బైడెన్, కమలా హ్యారిస్‌ అసలు గట్టిపోటీ ఇస్తారా అన్న పరిస్ధితి నుంచి ఏకంగా రిపబ్లికన్లపై సంచలన విజయం సాధించడం వరకూ ఓ చరిత్రగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీరు సాధించిన అద్భుత విజయంపై అమెరికాతో పాటు పలు దేశాల మీడియా, ఇతర ప్రముఖులు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈ ఏడాది తమ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు కోసం సంయుక్తంగా బైడెన్‌-కమల ద్వయాన్ని ఎంపిక చేసింది.

టైమ్‌ మ్యాగజైన్ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ రేసులో వీరితో పాటు అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్ద డైరెక్టర్‌ ఆంటోనీ ఫౌసీ, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు హెల్త్‌ కేర్‌ వర్కర్లు కూడా పోటీపడ్డారు. అయితే కరోనాపై పోరాడిన హెల్త్‌ వర్కర్లు, అమెరికన్లను సకాలంలో అప్రమత్తం చేసి మరణాలను నివారించిన ఆంటోనీ ఫౌసీ కంటే కూడా భవిష్యత్తులో తమ నిర్ణయాలతో కరోనాపై పోరాడగలమన్న నమ్మకాన్ని కల్పించిన బైడెన్‌-కమలా హ్యారిస్‌ ద్వయాన్నే తమ ఛాయిస్‌గా టైమ్‌ మ్యాగజైన్‌ కమిటీ ఎంపిక చేసింది.