కొత్త చట్టాల తో రైతుల ఆదాయం రెట్టింపు: మోదీ

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎఫ్‌ఐసీసీఐ యొక్క 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ..రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చినట్లు తెలిపారు. రైతులు తమ పంటలను మండీలతో పాటు ఇతర ప్రదేశాల్లోనూ అమ్ముకోవచ్చు అని, రైతులు తమ ఉత్పత్తుల్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ అమ్ముకునే సౌకర్యం ఉందని ఆయన తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారిని మరింత సమృద్ధిగా మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోడి వెల్లడించారు.

వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల మధ్య ఉన్న అవరోధాలను కొత్త వ్యవసాయ చట్టాలు రూపుమాపనున్నట్లు ప్రధాని చెప్పారు. రైతులకు కొత్త మార్కెట్లకు కల్పిస్తున్నామని, టెక్నాలజీ ద్వారా వారు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. నూతన సంస్కరణలతో రైతులకు కొత్త మార్కెట్లు లభిస్తాయని, వారికి ఆప్షన్లు కూడా పెరుగుతాయని తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ మౌళిక సదుపాయాలను ఆధునీకరించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. దీని వల్ల వ్యవసాయ రంగంలో అధిక పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు.