తెలుగు రాష్ట్రాల్లో పాడ్యమి

కార్తికమాసం చివరి రోజు పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి పోలాంబను స్వర్గానికి సాగనంపుతూ దీపాలు విడిచిపెట్టారు.

తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో మహిళలు పవిత్ర గోదావరి నదిలో దీపాలు వదిలారు. అనంతరం దేవాలయాలను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. కృష్ణాజిల్లాలో.. విజయవాడలో కృష్ణాతీరం దీపకాంతులతో ప్రకాశించింది. ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నదీ పరివాహకంలో మహిళలు దీపాలు వెలిగించారు. తోట్లవల్లూరులో కార్తీకమాసం ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన మహిళలు దీపారాధన చేసి దీపాలను కృష్ణానది పాయల్లో వదిలారు.

పరమశివుడికి పూజలు చేసి కార్తీక దామోదరుడిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. నదిలో పోలాంబకు దీపాలు విడిచిపెట్టడంతో కార్తీకమాసం పరిసమాప్తమయిందని భక్తలు విశ్వాసం.

కార్తీక మాసం చివరి రోజు మహిళలు చేసే దీపారాధనలకు ప్రత్యేకత ఉంది. పూర్వం పోలి అనే మహిళ అత్యంత భక్తిశ్రద్ధలతో కార్తీక మాసం అన్ని రోజులు దీపారాధనలు చేసి దేవతల మెప్పు పొంది స్వర్గలోక ప్రాప్తి పొందారని ఇక్కడి ప్రజల నమ్మకం. దీంతో కార్తీకమాసం చివరి రోజు పోలి మాదిరిగా తమకు కూడా స్వర్గలోక ప్రాప్తి లభించేలా మోక్షం పొందేలా చేయమని ఆకాంక్షిస్తూ మహిళలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వేద పండితులు కార్తీకమాస చివరి రోజు ప్రాధాన్యాన్ని మహిళలకు వివరించారు.