కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ క్రమంలో  శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఒక్క శ్రీకాళహస్తీలోనే కాదు.. శైవ క్షేత్రాన్నింటికి భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటీశుణ్ణి దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుడిని ఆరాధిస్తున్నారు.

ఇక దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామిల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలతో తరలి రావడంతో శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుండే పాతాల గంగ వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పాతలగంగలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. దీంతో పాతాలగంగ ప్రాంతం అంతా దీపకాంతుల వెలుతురులతో తళుక్కుమంటోంది. ఇదిలాఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయాల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు భక్తులు సామాజిక దూరం పాటించేలా సూచనలు, సలహాలు ఇస్తున్నారు.