రైతు ఇంట్లో అమిత్ షా భోజనం..

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు పశ్చిమబెంగాల్‌కు వెళ్లిన అమిత్ షా.. తూర్పు మిడ్నాపూర్‌లో గల బలిజ్యూరీ గ్రామంలో ఓ రైతు ఇంట్లో భోజనం చేశారు. ఆయనతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, బీజేపీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘోష్ కూడా ఉన్నారు.

వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగానే రైతు ఇంటి వద్ద భోజనం చేశారు. నవంబర్‌లో కూడా అమిత్ షా పర్యటించిన సంగతి తెలిసిందే. తర్వాత మరోసారి టూర్ కొనసాగుతోంది. మిడ్నాపూర్ ర్యాలీ తర్వాత రైతు ఇంటికి అమిత్ షా వచ్చారు.

తమ ఇంటిలో అమిత్ షా భోజనం చేస్తారని రైతు శానతన్ సింగ్ క్లబ్ సభ్యులకు సమాచారం అందజేశారు. తమ ఇంటికి షా అండ్ కో రావడం సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలో ఇలాంటి రోజు వస్తోందని అనుకోలేదని చెప్పారు. తానో రైతునని.. పేద అన్నదాతను చెప్పారు. పప్పుతో అన్నం మాత్రమే పెట్టగలనని చెప్పారు.

దేశం శాంతి, సౌభ్రాతుత్వంతో ఉండేట్టు చూడాలని అమిత్ షాను కోరానని సింగ్ తెలిపారు. ఇందుకు బీజేపీ కట్టుబడి ఉందని.. తాను కూడా 50 ఏళ్ల పాటు అనుబంధం కలిగి ఉన్నానని వివరించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగుతోంది. ఈ సమయంలో రైతు ఇంటి వద్ద భోజనం చేసి మంచి సంకేతాలను అమిత్ షా ఇచ్చారు.