రాక్షస గణాలకు ప్రతిరూపాలే వైసీపీ నేతలు

  • రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోవాలి అంటే వైసీపీ నాయకులకి కప్పం కట్టాలా?
  • రానున్న రోజుల్లో ప్రజల ఆస్తిలో కూడా వాటాలు అడుగుతారేమో?
  • వైసీపీ ప్రభుత్వం కన్నా బ్రిటీష్ పాలనే నయం
  • జనసేన అధికారంలోకి వస్తే ఇలాంటి దురాగతాలు ఉండవు

గుంటూరు నగరంలో సిటీ కేబుల్, ఇతర నెట్ వర్క్ ల వైర్లను కట్ చేయడంపై జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సృష్టిలోని రాక్షస గణాలన్ని వైసీపీ నేతల రూపంలో రాష్ట్రం మీద పడి ప్రజల్ని పీక్కు తింటున్నాయని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి విమర్శించారు. గత ఆరు రోజులుగా నగరంలో జరుగుతున్న కేబుల్ వార్ పై వైసీపీ నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం దెబ్బతిన్న పలు కేబుల్ వైర్లను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోవాలి అంటే వైసీపీ నేతలకు కప్పం కట్టాలా అని ప్రశ్నించారు. బ్రిటీష్ వాళ్ళ పాలన కన్నా అత్యంత దుర్మార్గంగా, దాష్టీకంగా వైసీపీ పాలన ఉందని దుయ్యబట్టారు. సొంత కేబుల్ నెట్ వర్క్ కోసం సుమారు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సిటీ కేబుల్ వ్యవస్థను నాశనం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. అందుకోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిటీ కేబుల్ వైర్లు కట్ చేయటం పాశవికం అన్నారు. కాపాడాల్సిన కనురెప్పే కాటేస్తుంటే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు. వారం రోజులుగా గుంటూరు చుట్టుపక్కల పరిసరాల్లో ప్రసారాలు రాకుండా చేయడంపై ప్రజల్లో వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం నెలకొందని పేర్కొన్నారు. వ్యాపారాల్లో పోటీ ఉంటే ఇంకా ఎక్కువ నాణ్యమైన సేవలు అందించి ప్రజల్ని తమ వైపుకి తిప్పుకోవాలన్నారు. అంతేకానీ తమకు ఇతరుల వ్యాపారాల్లో వాటా కావాలంటూ వైసీపీ నేతలు తెగబడటం అరాచకానికి పరాకాష్ట అన్నారు. ఇప్పటికే ఎంతోమంది వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. రాబోయే రోజుల్లో తమ ఆస్తిలో వాటాలు కావాలంటూ కూడా వైసీపీ నేతలు అడుగుతారేమో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కోట్లు దోచుకుంటే వైసీపీ నేతలు ధనదాహం తీరుతుందో అర్ధం కావటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు నగరంలో జరుగుతున్న పరిణామాలపై భద్రత కలిపించాల్సిన వ్యవస్థలు సైతం చేష్టలుడిగి చూడటం పట్ల ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికారం ఉంటే ఎంతటి దుర్మార్గాలు అయినా చేయొచ్చు అని అడ్డుకునే వ్యవస్థలే ఉండవనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇచ్చి చారిత్రక తప్పు చేశాం అన్న అపరాధ భావన ప్రజల్లో నెలకొందని , వచ్చే ఎన్నికల్లో తమ తప్పుకు ప్రాయచ్చిత్తం తీర్చుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జనసేనకు ప్రజలు అవకాశం ఇస్తే ఇలాంటి దూరాగతాలకు, దాష్టీకాలకు ఆస్కారం లేకుండా పవన్ కళ్యాణ్ సుపరిపాలన అందిస్తారని ఆళ్ళ హరి పేర్కొన్నారు. 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, వడ్డె సుబ్బారావు, శెట్టి శ్రీను, సయ్యద్ రఫీ, దన్నాన కామేష్, మహేష్, సాయి, యాకోబు తదితరులు పాల్గొన్నారు.