జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాలకు సిద్ధం

  • జిల్లా పెద్దలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
  • క్వీన్స్ ఎన్ఆర్ఐ సీఈవో తుమరాడ చంద్రమౌళి

పార్వతీపురం, మన్యం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సీఈవో తుమరాడ చంద్రమౌళి అన్నారు. బుధవారం ఆయన పార్వతీపురం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్య సేవలతో ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలను తమ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ద్వారా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో నిపుణులైన ప్రముఖ వైద్యుల వైద్య సేవలతో పాటు కొన్నిరకాల మందులు, కొన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వేసవితోపాటు రానున్న రోగాల సీజన్లో ప్రజలకు పలు రకాల రోగాలు ఆశించే అవకాశం ఉందన్నారు. అలాగే దీర్ఘకాలిక రోగులకు సైతం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తాను జిల్లాలోని కొమరాడ మండలం మాదలంగి గ్రామానికి చెందిన వాడను కావడంతో జిల్లా అంటే తమకు అమితమైన ఇష్టమన్నారు. ఈ నేపథ్యంలో తన వంతుగా జిల్లా ప్రజలకు వైద్యపరమైన సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కాబట్టి జిల్లాలోని అధికారులు, రాజకీయ నాయకులు, పెద్దలు స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తే తమ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలకు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.