అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌కూ గ్రీన్‌సిగ్నల్‌!

కరోనా మహమ్మారి అంతానికి రూపొందిన భారత తొలి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. కరోనా వైరస్‌ రూపాంతరం చెంది, కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. క్లినికల్‌ ట్రయల్‌ విధానంలో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని సూచించింది. కొవాగ్జిన్‌కు డీసీజీఐ తుది అనుమతి రావడమే మిగిలి ఉంది. అది లాంఛనప్రాయమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై భారత్‌ బయోటెక్‌ దృష్టి సారించనుంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశమై కొవిడ్‌-19 టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే అంశంపై చర్చించింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతిని సిఫార్సు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. శనివారం మరోసారి సమావేశమైన నిపుణుల కమిటీ.. భారత్‌ బయోటెక్‌ దరఖాస్తును, ఆ సంస్థ సమర్పించిన అదనపు డేటా, వాస్తవాలు, విశ్లేషణ వివరాలను పరిశీలించింది. కరోనా వైరస్‌లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రజాప్రయోజనాల మేరకు అత్యవసర పరిస్థితుల్లో ముందుజాగ్రత్తగా క్లినికల్‌ ప్రయోగాల విధానంలో ఉపయోగించడానికి అనుమతినివ్వాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది. అయితే కొవాగ్జిన్‌పై మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలను కొనసాగించాలని భారత్‌ బయోటెక్‌కు నిపుణుల కమిటీ సూచించింది. ఆ డేటాను ఎప్పటికప్పుడు సమర్పించాలని నిర్దేశించింది. అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థ కూడా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ పరిశీలన చేపట్టలేదు. క్యాడిలా హెల్త్‌కేర్‌ అభివృద్ధి చేస్తున్న మరో టీకాకు మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతినివ్వాలని సూచించింది. కమిటీ తాజా నిర్ణయంతో కొద్ది రోజుల్లో రెండు టీకాల విడుదలకు మార్గం సులభమవుతుంది.