పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన సంపూర్ణ లాక్‌డౌన్‌

కరోనా ఉధృతి నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆంక్షలు ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. సంపూర్ణ లాక్‌డౌన్ సందర్భంగా పరిశ్రమలు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్ర రైళ్లు, బస్సులను నిలిపివేశారు. అన్నిరకాల సమావేశాలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని తేయాకు తోటల్లో 50 శాతం కార్మికులు పనిచేసేలా వెసులుబాటు కల్పించింది. జనపనార మిల్లుల్లో 30 శాతం కార్మికులు పనిచేసేందుకు అనుమతించింది. అత్యవసర సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు నిచ్చారు. ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుక్కునేందుకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.

పశ్చిమబెంగాల్‌లో నిన్న 20,846 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 10,94,802కు చేరాయి. ఇందులో 1,31,792 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9,50,017 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 12,993 మంది మృతిచెందారు.