కార్పోరేషన్ లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలి

  • సాక్ష్యాత్తు కార్పొరేటర్లే అవినీతి జరిగింది అంటున్నారు అంటే కార్పొరేషన్లో పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధమవుతుంది
  • అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరుతో కుంటుపడుతున్న నగరాభివృద్ధి
  • నేతల కోసం జట్లుగా విడిపోయి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి పైచేయి కోసం పడరాని పాట్లు పడుతున్న కార్పొరేటర్లు
  • మూడు సంవత్సరాలుగా డివిజన్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయాం అని చెప్పటానికి సిగ్గులేదా?
  • నగరపాలక సంస్థ చేపట్టిన పనుల్లో , గాంధీ పార్కు మరమ్మతుల విషయంలో జరిగిన , జరుగుతున్న అవినీతిపై కార్పొరేటర్లకు ఇప్పుడు మెలుకువ వచ్చిందా?
  • అవినీతిపై కౌన్సిల్ లో ఎందుకు ప్రశ్నించలేదు? అప్పటికి ఎవరి వాటా వారికి వచ్చిందా? వాటాలు సరిగ్గా లేకపోయే సరికి రోడ్డున పడ్డారా?
  • జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: నగరపాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి పనుల్లో భారీ అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు అధికార కార్పొరేటర్లే ఫిర్యాదు చేసారంటే కార్పొరేషన్లో అవినీతిరాకాసి ఎంతగా జడలువిప్పుతుందో అర్ధమవుతుందని, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ వ్యవస్థతో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ లో అవినీతి తాండవిస్తుంది అంటూ అధికార వైసీపీ కార్పొరేటర్లు కమీషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంపై మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రెండు రోజులుగా అధికార పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరుతో నగరాభివృద్ధి కుంటుపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన కార్పొరేటర్లు నాయకుల కోసం రెండు జట్లుగా విడిపోయి ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా నగరపాలక సంస్థలో అవినీతి జరుగుతుంటే ఇంతకాలం ఈ కార్పొరేటర్ లు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మహాత్మాగాంధీ పార్కు అభివృద్ధి పనుల్లో కేవలం పై పై మెరుగులకు, చిన్న చిన్న మరమ్మతులకు ఐదు కోట్లు ఖర్చు చేస్తున్న విషయంపై కౌన్సిల్ లో ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మూడేళ్ళుగా ఇప్పటివరకు మా డివిజన్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలకి మొహం చూపెట్టలేకపోతున్నామని కార్పొరేటర్ లు చెప్పటం సిగ్గుచేటన్నారు. మిమ్మల్ని గెలిపించి కార్పొరేషన్ కి పంపించింది ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించి డివిజన్ ని అభివృద్ధి చేస్తారని కానీ ఇలా దద్దమ్మల్లా చేష్టలుడిగి నిలుచుంటారని కాదని ధ్వజమెత్తారు. తమ డివిజన్ అభివృద్ధి కోసం నిధులు కావాలని స్థానిక శాసనసభ్యులను, మేయర్ ను, కమీషనర్ ను అడగలేని దీనస్థితిలో కార్పొరేటర్ లు ఎందుకు ఉన్నారో అర్ధం కావటం లేదన్నారు. రాజకీయంగా ఆధిపత్యం సాధించుకునే క్రమంలో జరుగుతున్న రాక్షస క్రీడలో ప్రజా శ్రేయస్సుకి కానీ నగరాభివృద్ధి కి కానీ విఘాతం కలిగితే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఇప్పటికైనా ప్రజలు మీకిచ్చిన మెజారిటీని, మీమీద పెట్టుకున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమానికి, నగరాభివృద్ధికి కృషి చేయాలని కార్పొరేటర్లను కోరారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆళ్ళ హరి హెచ్చరించారు.