అభయహస్తం హాంఫట్ !

* మహిళలు దాచుకున్న సొమ్ములను మింగేసిన సర్కారు
* 11 నెలల క్రితం దొంగచాటుగా రూ.2 వేల కోట్లు డ్రా
* అర్ధంతరంగా వైదొలిగిన ఎల్ఐసీ
* అభయహస్తం పింఛను పథకం అస్తవ్యస్తం
* మహిళల డబ్బులను తిరిగి చెల్లించని దుస్థితి

అమ్మ పెట్టా పెట్టదు… ఉన్నదీ లాక్కుంటుంది…. అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు. అభయహస్తం పథకంలో మహిళలు దాచుకున్న డబ్బులను దొంగచాటుగా విత్ డ్రా చేసుకున్న ప్రభుత్వం ఆ డబ్బులను లబ్ధిదారులకు జమ చేయడం లేదు. కాళ్లరిగేలా తిరిగి, గట్టిగా అడిగితే.. అప్పుడప్పుడు కాస్త కాస్త మొత్తాలను మాత్రమే విడుదల చేస్తూ కాలం గడుపుతోంది తప్పితే మహిళలు దాచుకున్న డబ్బులు పూర్తిగా ఇవ్వడం లేదు. దాచుకున్న డబ్బులకు వడ్డీలు రాక, ప్రభుత్వం డబ్బులు చెల్లించక మహిళలు విసుగు చెందుతున్నారు.
• 2009లో అభయహస్తం పథకం ప్రారంభమయింది. 2014 వరకు ఈ పథకంలో అర్హుల పేర్ల నమోదు జరిగింది. పథకంలో చేరడానికి 18 నుంచి 59 ఏళ్ల వయసున్న డ్వాక్రా మహిళలు అర్హులు. ఈ పథకంలో భాగంగా మహిళలు ఏడాదికి రూ.365లు చెల్లిస్తే, దానికి ప్రభుత్వం మరో రూ.365లు మ్యాచింగ్ నిధిని జమ చేస్తుంది. అలా 60 ఏళ్ల వరకు జమ చేసిన మొత్తం ఆధారంగా రూ.500 నుంచి రూ.2 వేల వరకు అభయహస్తం పింఛను అందుతుంది.
• వృద్ధాప్యంలో మహిళలకు ఆర్థిక భరోసా అందేలా చూసేందుకు ఈ పథకం నిర్దేశించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఏటా మహిళలు తమ వంతు సొమ్ములు అందించాల్సి ఉంటుంది. వరుసగా 3 సంవత్సరాలు పాటు పథకానికి డబ్బులు జమ చేయకపోతే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. వారు పథకం నుంచి వైదొలిగినట్లు భావిస్తారు.
• అలా వైదొలిగిన వారికి సంబంధించి.. అప్పటి వరకు అభయహస్తం పథకంలో దాచుకున్న డబ్బులను ప్రభుత్వం తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తుంది. ఒకవేళ లబ్ధిదారులు చనిపోతే… వారు దాచుకున్న సొమ్ములతో పాటు, ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ మొత్తం వడ్డీతో సహా కలిపి చెల్లిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ పథకంలో 34 లక్షల మంది చేరారు. అయితే ప్రస్తుతం ఈ పథకంలో కేవలం 5.52 లక్షల మందే కొనసాగుతున్నారు. 1.56 లక్షల మంది అభయహస్తం పింఛను పొందుతున్నారు.
• అభయహస్తం పథకాన్ని ఎల్ఐసీ సంస్థ నిర్వహించేది. లబ్ధిదారులు, ప్రభుత్వ వాటా ఆ సంస్థకే జమ అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తర్వాత కూడా అభయహస్తం లబ్ధిదారులు మూడేళ్లు డబ్బులు కట్టకుండా పథకం నుంచి వైదొలిగితే… ఎల్ఐసీ ఆ డబ్బును వెంటనే లెక్క చూసి లబ్ధిదారులకు అందించేది. అయితే గత 11 నెలలుగా అది ఆగిపోయింది. పథకం నుంచి వైదొలిగిన వారు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్నా స్పందన లేదు. దీనికి ప్రభుత్వం డబ్బులు మళ్లించడమే కారణం.
• వైసీపీ ప్రభుత్వం 11 నెలల క్రితం మహిళలు అభయహస్తం పథకంలో దాచుకున్న డబ్బులపై కన్నేసింది. వెంటనే ఆ డబ్బును తమ ఖాతాలకు మళ్లించుకుంది. సుమారు రూ.2 వేల కోట్లను ప్రభుత్వం అక్రమ మార్గంలో తరలించింది. దీంతో గత నవంబరులోనే ఎల్ఐసీ బహిరంగ ప్రకటన విడుదల చేసి… తమకు అభయహస్తం పథకంతో సంబంధం లేదని ప్రకటించింది. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ అధికారులు స్పందించి.. పథకంలో వైదొలిగిన లబ్ధిదారులకు వెంటనే డబ్బు జమ చేస్తామని ప్రకటించారు. ప్రకటించిన నాటికే రూ.300 కోట్ల మేర లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. దాని తర్వాత మరో 3 లక్షల మంది లబ్ధిదారులు విడతల వారీగా వైదొలిగారు. ఇప్పటివరకు క్రమంగా వైదొలిగిన వారి సంఖ్య 10 లక్షలు. వీరికి రూ.500 మేర డబ్బులు జమ చేయాల్సి ఉంది.
• అసలు ఎల్ఐసీ నుంచి అర్ధంతరంగా నిధులు తీయాల్సిన అవసరం ఏంటీ..? తీసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఖాతా పెట్టి నిధులను పర్యవేక్షిస్తోంది అని చెబుతున్నారు తప్పితే… దానికి సరైన సమాధానం ఇప్పటి వరకు లేదు. సెర్ప్ నిధులు వాడేస్తున్నారు.
• గ్రామీణ పేదరికి నిర్మూలన సొసైటీ (సెర్ప్) నిధులను దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వాడేస్తోంది. లబ్ధిదారులు తాము దాచుకున్న మొత్తాన్ని ఇవ్వాలని కోరుతుంటే దాన్ని విడతల వారీగా విడుదల చేస్తున్నారు. దీనికోసం సెర్ప్ ప్రత్యేక నిధి నుంచి ఇస్తున్నారు. ఇలా ఇప్పటికీ రూ.100 కోట్ల మేర ప్రత్యేక నిధి సొమ్ములను వాడేశారు. వాటిని జమ చేయాల్సిన ప్రభుత్వం మాత్రం వాటిని మళ్లీ సెర్ప్ కు అందించడం లేదు.
• అభయహస్తం డబ్బులను అత్యవసరంగా ప్రభుత్వం ఎల్ఐసీ నుంచి ఎందుకు విత్ డ్రా చేసిందనేది అంతుబట్టని రహస్యం. అభయహస్తం మొత్తం మీద రూ.2 వేల కోట్లు ఎల్ఐసీ వద్ద ఉంటే ప్రతి నెలా దానికి వడ్డీ జమ అయ్యేది. దాచి ఉంచిన సొమ్ముకు అదనంగా ఇది పెరుగుతూ ఉండేది. అయితే డబ్బును ఒకేసారి ప్రభుత్వం విత్ డ్రా చేయడంతో వడ్డీ రూపంలో భారీగా నష్టం వచ్చింది.
• ఎల్ఐసీ దగ్గర నుంచి డబ్బులను ప్రభుత్వం ఒకేసారి తీసుకుంటున్న సమాచారం అందుకున్న ఓ జాతీయ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిపై సంప్రదించింది. ఎల్ఐసీ చెల్లించిన వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని, తమ బ్యాంకులో ఆ మొత్తం జమ చేయాలని కోరినా ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేదు. ఇతర ఏ బ్యాంకులోనూ డబ్బును దాయలేదు. మొత్తానికి ఆ డబ్బులను ప్రభుత్వం ఏ చేసిందనేది అంతుపట్టని మిస్టరీగా చెప్పుకోవచ్చు.
• రాన్రాను మహిళలు అభయహస్తం డబ్బులను కట్టడం ఆగిపోతోంది. ప్రభుత్వ తీరు మీద, భవిష్యత్తులో పథకం అందదు అనే ప్రచారంతో మహిళలు తమ వాటా డబ్బులను కట్టడం లేదు. దీంతో లబ్ధిదారులకు ప్రతి ఏటా చెల్లించాల్సిన సొమ్ము పెరిగిపోతోంది. మరి మహిళలు తమ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు ఎవరు చెల్లిస్తారు..? ఎలా చెల్లిస్తారు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.