ఏపీలో వేగవంతం కానున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో అర్ధంతరంగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ వ్యాక్సినేషన్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీలో వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరిగింది. పట్టణాల్లో మాత్రం ఎన్నికల ప్రక్రియ లేకపోవడంతో టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేయనున్నారు. నాలుగు వారాల వ్యవధిలో కోటిమందికి వ్యాక్సిన్ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంత త్వరగా పూర్తి చేయాలనేది ప్రణాళిక రచించారు. ఇక 45-60 ఏళ్ల ఉండి దీర్ఘ కాలిక రోగాలుంటే కూడా ఈ దశలో వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. ఈ కేటగరీలో 6.31 లక్షలుండగా ఇప్పటికవరకూ 2.19 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక 60 ఏళ్లు పైబడినవారు 52.52 లక్షలుంటే.. ఇప్పటివరకూ 5.11 లక్షల మందే వ్యాక్సిన్ తీసుకున్నారు.

మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ముగియడంతో ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. మార్చ్ 31 తరువాత కొత్త ఎన్నికల కమీషనర్ బాధ్యతలు స్వీకరించాక మిగిలిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి..గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.