Vizag: అధికార యంత్రాంగంలో కదలిక

విశాఖజిల్లాలో అధికారపార్టీ నేత అనధికార చేపల పెంపకంపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం స్పందించింది. అధికారం అండతో పెందుర్తి మండలం నరవ ప్రాంతంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ చెరువులో చేపల పెంపకం సాగిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా కోడివ్యర్థాలను వినియోగిస్తున్న నేపథ్యంలో వాస్తవాలను ప్రతిభింబిస్తూ “కోట్లు కురిపిస్తున్న కోడి వ్యర్ధాలు” శీర్షికన ప్రచురించిన కథనానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ టి.లక్ష్మణరావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరావు, స్థానిక విఆర్వో చెరువును పరిశీలించి అనధికార చేపల పెంపకం, కోడివ్యర్థాల వినియోగం జరుగుతున్నట్లు నిర్ధారించారు. నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారంపై అక్రమ వ్యాపారులకు నోటీసులు జారీచేయడంతో పాటుగా కోడివ్యర్థాల వినియోగం ద్వారా ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్న వ్యవహారంపై జివిఎంసి కమీషనర్కు కూడా నివేదిక ఇవ్వనున్నట్లు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

అయితే అధికార మదంతో విర్రవీగుతూ ప్రజల ప్రాణాలను పైసలుగా మార్చుకుంటున్న నీలి పార్టీ లీడర్ పై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా లేక నోటీసుల పేరుతో కాలయాపన చేసి అధికారపార్టీ నేతలపై స్వామి భక్తిని చాటుకుంటారా వేచి చూడాలి మరి. ఇదిలా ఉంటే ప్రజల ప్రాణాలను హరిస్తున్న కోడివ్యర్థాల వ్యవహారంలో నగరవ్యాప్తిగా దర్జాగా సాగుతున్న వ్యర్థాల సేకరణ సహా ఇతర జిల్లాలకు తరలింపు వరకు జరుగుతున్న ప్రక్రియపై నగర ఉన్నతాధికారులు స్పందించకపోవటం గమనార్హం. కేవలం ఒక చెరువుపై చర్యలతో సరిపెడితే రాష్ట్రవ్యాప్తిగా జరుగుతున్న దందాకు అడ్డుకట్టవేసేదేవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతు న్నాయి. నిత్యం నగర నలుమూలలలో ఉన్న వందలాది. మాంసం దుకానాల నుంచి వాహనాల ద్వారా వ్యర్థాలను సేకరిస్తూ వాటిని ఇతర జిల్లాలకు చేరవేస్తున్నప్పటికీ ఈ దందా మొత్తం రాష్ట్ర ప్రజల సొమ్ముతో వేతనాలు తీసుకుంటున్న వివిధ శాఖల్లో ఏ ఒక్క అధికారి కళ్ళకు కనిపించకపోవటం గమనార్హం. నగరంలో అడుగడుగునా ఏర్పాటు చేసిన నిఘానేత్రాలలో ఈ తతంగం అంతా రికార్డు కావటంలేదా..? అడ్డుకట్ట వేయాల్సిన అధికారులకు నిఘా నేత్రాల ఆధారం సరిపోవట్లేదా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వాస్తవానికి ఈ మొత్తం అరికట్టాలనే ఆలోచన నగర ఉన్నతాధికారులకు ఉన్నట్లయితే డంపింగ్ యార్డు వద్ద ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తే ప్రతిరోజు నగరంలో సేకరిస్తున్న వ్యర్థాల్లో డంపింగ్ యార్డుకు చేరుతున్నదెంత ఇతర జిల్లాలకు తరలుతున్నదెంత అనేది సుస్పష్టమవుతుంది. గత అధికారులు మాముళ్ళమత్తులోనో అధికార ఒత్తిళ్లతోనో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిం చినా ఇటీవల నగర కమీషనర్ బాధ్యతలు చేపట్టిన లక్ష్మీషా కోడివ్యర్థాల మాఫియా ఆటకట్టించి తన మార్కును చూపిం చాలని విశాఖవాసులు కోరుతున్నారు.