ఘర్షణలకు స్వస్తి పలికేoదుకు రెండు దేశాల మధ్య ఒప్పందం

భారత్‌-చైనా మధ్య సరిహద్దుల్లో సుమారు నాలుగు నెలలుగా నెలకొన్న ఘర్షణ వాతావరణానికి స్వస్తి పలికేoదుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపధ్యంలో ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను ఖరారు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రెండు దేశాలకూ మంచిదికాదని చైనా సైతం అంగీకరించింది. తక్షణమే ఎల్‌ఏసీ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఎల్‌ఏసీ నుంచి రెండు దేశాల సైన్యాలు సమదూరం పాటించాలని నిర్ణయించారు. సరిహద్దు వివాదంపై పరస్పరం చర్చలు కొనసాగించేందుకు అంగీకరించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయానికి మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సు వేదికగా నిలిచింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఎస్‌.జైశంకర్‌, వాంగ్‌ యీ గురువారం సాయంత్రం ఈ మేరకు చర్చలు జరిపారు. భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు వద్ద ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. నాలుగు నెలలుగా అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపధ్యంలో… రెండు దేశాల మధ్య తాజా ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది.