అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..

బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్‌ వ్యవహారంపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రబాద్‌ సెషన్‌ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కోర్టు విచారణను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అఖిల ప్రియ బెయిల్‌ విషయంపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. ఇదిలా ఉంటే.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే రెండు సార్లు కొట్టేసిన విషయం తెలిసిందే. అఖిల ప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు వేసిన పిటిషన్‌తో ఏకీభవించిన కోర్టు అఖిల ప్రియ బెయిల్‌కు నిరాకరించింది.