తిషిని వాల్ జయంతి.. నడక పోటీలు నిర్వహించిన అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

విజయనగరం: వాకర్స్ ఉద్యమ కారులు, మాజీ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ జె.ఎల్. తోషిని వాల్ 93వ జయంతి, గురువారం పురస్కరించుకొని బుదవారం ఉదయం అయ్యన్నపేటలో కొత్తగా నిర్మితమైన వాకింగ్ ట్రాక్ లో జయంతి వేడుకలను అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కర్రోతు సత్యం, విశిష్ట అతిథిలుగా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కార్యదర్శి టి. చిరంజీవి రావు, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాస్టారు, డిస్ట్రిక్ట్ 102 ఏరియా కో ఆర్డినేటర్ జి. కృష్ణం రాజు, రీజనల్ కౌన్సిలర్ కె. ఎర్నాయుడు మాస్టారు, డిప్యూటీ గవర్నర్ ఈపు విజయ్ కుమార్ మాస్టారు హాజరయ్యారు. ముందుగా వేడుకల్లో భాగంగా తోషిని వాల్ చిత్రపటానికి పూలమాల వేసి వాకర్స్ క్లబ్ పెద్దలంతా నివాళలర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కర్రోతు సత్యం నడక పోటీలను ప్రారంభించారు. నాలుగు వయస్సు విభాగాల్లో నిర్వహించిన ఈ నడక పోటీలకు జడ్జీ గా వాకర్స్ క్లబ్ గౌరవ సలహాదారులు ఎ.తిరుపతిరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కర్రోతు సత్యం మాట్లాడుతూ వాకర్స్ ఉద్యమానికి ఆదర్శ పితామహుడు జానికీ లాల్ తోషినీ వాల్ అని, ఇటువంటి మహనీయున్ని ప్రతీ నడక సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలని, వాకర్స్ మహనీయులు అల్వార్ దాస్, తోషిని వాల్ వారి వంటి ఆశయాలను ఆచరణలో నిలబెట్టడం మనందరి బాధ్యత అని అన్నారు. విశిష్ట అతథులుగా హాజరైన వాకర్స్ పెద్దలు మాట్లాడుతూ నడక ఉద్యమ మహనీయుడు తోషిని వాల్ జయంతి సందర్భంగా నడక పోటీలను నిర్వహించటం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు నడక సభ్యుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, ప్రతీ ఒక్కరూ నడచి ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలని, మనం బాగుంటేనే సమాజం బాగుంటుందని అన్నారు. అనంతరం నడక పోటీల్లో గెలిచిన విజేతలకు, పోటీల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాకర్స్ పెద్దలు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విజేతలకు గురువారం నాడు తోషినీ వాల్ భవనంలో జరిగే తిషినీ వాల్ జయంతి వేడుకల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎస్పీ రవీంద్ర చే బహుమతులను అందజేస్తారని క్లబ్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు చెల్లూరి శ్రీనివాసరావు, ప్రగతి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, బాలాజీ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రామరాజు, ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు, రామసాయి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కొల్లు సత్యం, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ పెద్దలు ఆర్.సి.హెచ్ అప్పల నాయుడు, రమేష్ బాబు, జి.గోవిందరావు, ఐ.వి. ప్రసాదరావు, వై.నలమహారాజు, ఎం.శ్రీనివాసరావు, ఎస్.ఎస్.ఎస్.కుమార్, తోషిని వాకర్స్ క్లబ్ పెద్దలు బసవ మూర్తి, దేవరాజు తదితర సభ్యులు హాజరయ్యారు.