గుంటూరులో ఇద్దరు కరోనా రోగులకు యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్లు

కరోనా రోగుల్లో సత్వర ఉపశమనానికి యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్లు ఉపయోగించడం ఏపీలో ప్రథమంగా గుంటూరులో చోటుచేసుకుంది. గుంటూరులోని శ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కరోనా రోగులకు రీజెనరాన్ యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ డోసులు ఇచ్చారు.

దీనిపై ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ కల్యాణచక్రవర్తి స్పందిస్తూ, రీజెనరాన్ సింగిల్ డోసు రూ.60 వేలు ఖరీదు చేస్తుందని తెలిపారు. దీన్ని వాడడం వల్ల ఆసుపత్రిలో ఎక్కువరోజుల పాటు చికిత్స పొందాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో కరోనా రోగులు ఆసుపత్రులకు చెల్లిస్తున్న బిల్లులతో పోల్చితే ఇది సాధారణమైన ఖర్చుగానే భావించాలని అభిప్రాయపడ్డారు.

అయితే, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక వీలైనంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇవాల్సి ఉంటుందని వివరించారు. ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్లను ప్రభుత్వం విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రీజెనరాన్ ఇంజెక్షన్ వినియోగించిన వారిలో అత్యధికులు కోలుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో ఇదొక దివ్యమైన ఔషధం అని డాక్టర్ కల్యాణచక్రవర్తి అభివర్ణించారు.