ఏపీ ఐసెట్ 2020 ఫలితాల విడుదల

ఏపీలో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐసెట్ నిర్వహించగా.. పరీక్ష ఫలితాలను శుక్రవారం సాయంత్రం అమరావతిలో మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరీక్షకు మొత్తం 51,991 మంది విద్యార్థులు హాజరు కాగా.. 40, 890 ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. 78.65 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు. టాప్ 10 లో నలుగురు అమ్మాయిలు ఉన్నారన్నారు. మొదటి 10 ర్యాంకుల్లో ఆరు ర్యాంకులు వెనకబడిన కులాలు, షెడ్యూల్ కులాలకు చెందినవారు సాధించారని మంత్రి సురేష్ వివరించారు. కేవలం రెండు వారాల్లో పరీక్ష ప్రక్రియ పూర్తి చేసి రికార్డ్ టైం లో ఫలితాలు విడుదల చేశామన్నారు.

కరోనా కారణంగా పరీక్షలు రాయని విద్యార్థులకు అక్టోబర్ 7న మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఈ ఏడాది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామని, ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, టెన్త్ సిలబస్ ఆధారంగా ట్రిపుల్ ఐటీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. నవంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించాలని యోచనలో ఉన్నట్లు సురేష్ పేర్కొన్నారు.

ఐసెట్ ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి: https://sche.ap.gov.in/ICET/ICET/ICET_GetResults.aspx