ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..

ఏపీలో పంచాయతీ ఎన్నికలను ఎట్టిపరిస్ధితుల్లోనూ నిర్వహించి తీరాలని పట్టుదలగా ఉన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ అందుకు అనుగుణంగా పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. ఓవైపు హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన నిమ్మగడ్డ ఇవాళ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటల తర్వాత విజయవాడలోని రాజ్‌భవన్‌ను వచ్చిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గవర్నర్‌తో దాదాపు అరగంటసేపు భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలను ఆయన గవర్నర్‌ హరిచందన్‌కు వివరించారు. ముఖ్యంగా ఉద్యోగుల వ్యవహారశైలిపై నిమ్మగడ్డ మరోసారి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లల్లా ఆడుతూ ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తున్న ఉద్యోగ సంఘాల విషయంలో చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను ఆయన కోరినట్లు సమాచారం.

అలాగే హైకోర్టు తీర్పుకు అనుగుణంగా రేపు పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు చేస్తున్న ఏర్పాట్లను నిమ్మగడ్డ గవర్నర్ హరిచందన్‌కు వివరించారు. హైకోర్టు తీర్పుతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా విచారణ జరిపి నిర్ణయం వెలువడకపోతే మాత్రం తాను యథావిథిగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు గవర్నర్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెప్పినట్లు తెలుస్తోంది.