తెలంగాణలో వార్డు ఆఫీసర్ల నియామకం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రతి పురపాలికలో వార్డు ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు వివరాలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో పురపాలక శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నామని తెలిపారు. పురపాలక శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు.

పౌరుడే కేంద్రంగా పౌరసేవలతో ప్రజలకు త్వరితగిన అందించేందుకు, పట్టణాల క్రమానుగత అభివృద్ధికి ఖాళీ భర్తీ దోహదపడుతుందని మంత్రి తెలిపారు. దీని ద్వారా నూతన పురపాలక చట్టం స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పటికే ఆరుసార్లు అంతర్గతంగా సమావేశమై పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన పురపాలక శాఖ ఉన్నతాధికారుల బృందం సుదీర్ఘ కసరత్తు చేసింది. త్వరలోనే ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యంత పాదర్శకంగా ఈ ఖాళీల భర్తీ జరగాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.