అర్ణబ్‌ గోస్వామి అరెస్టు

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్‌ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల అన్వయ్ నాయక్ అనే ఇంటీరియర్ డిజైనర్‌ను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించారన్న కేసులో అర్ణబ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో రాయిగఢ్‌, ముంబయి పోలీసులు ఓ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అన్వయ్‌ నాయక్‌ రాసిన సూసైడ్ నోట్‌లో అర్ణబ్‌ గోస్వామి సహా మరో ఇద్దరు వ్యక్తులు తనకు రావాల్సిన రూ.5 కోట్ల 40 లక్షలు చెల్లించలేదని తెలిపాడు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, అందుకే తాను సూసైడ్ చేసుకున్నట్లు లేఖలో అన్వయ్ నాయక్ పేర్కొన్నారు.  ఏపీఐ సచిన్‌ వాజే నాయకత్వంలోని పోలీసు బృందం అర్ణబ్‌ గోస్వామిని అదుపులోకి తీసుకుంది.అర్ణబ్‌పై ఐపీసీ సెక్షన్‌ 306, 34 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, అర్ణబ్‌కు చెందిన రిపబ్లిక్‌ టీవీ టీఅర్పీ రేటింగ్స్‌ కోసం మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా అర్ణబ్‌ అరెస్టును కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఖండించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని ఆయన మండిపడ్డారు.