ఏపీలోతుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లు పూర్తి..

ఏపీలోతుంగభద్ర పుష్కరాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపటి నుంచి డిసెంబర్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను రేపు మధ్యాహ్నం 1.21 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.  కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌ను సీఎం జగన్ సందర్శిస్తారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సందర్శించే సంకల్‌భాగ్‌ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్ప ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు.

అలాగే ఈ పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలోని 23 పుష్కర ఘాట్‌ల దగ్గర 23 మంది ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా.. సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. అటు కోవిడ్ కారణంగా భక్తులకు నదీ స్నానాలు అనుమతి లేనందున.. జల్లు స్నానాల కోసం ఘాట్ల దగ్గర స్ప్రింకర్లను ఏర్పాటు చేసింది.

ఇక పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రధానం చేయించేందుకు మొత్తం 350 పురోహితులను ఎంపిక చేసి.. గుర్తింపు కార్డులు అందజేశారు. వారికి రూ. 350 ఫీజుగా నిర్ణయించారు. కాగా, భక్తులకు ప్రతీ చోటా మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని.. భౌతిక దూరం పాటించేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించింది.

అయితే ప్రభుత్వం మాత్రం కరోనా నేపథ్యంలో పవిత్ర తుంగభద్ర నదిలో ఎవరూ పుణ్య స్నానాలు చేయకూడదని నిషేధం విధించింది. అంతేకాకుండా పుష్కరాల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో ఉచిత ఈ-పాస్ తీసుకోవాలని ఆంక్షలు పెట్టింది. అది కూడా కేటాయించిన టైం స్లాట్ ప్రకారం పుష్కరాలకు రావాలంటోంది. పిల్లలు, వృద్ధులు,కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి అనుమతి లేదని చెబుతోంది. వచ్చిన వారు నెత్తిన నీళ్లు చల్లుకుని పుష్కర ఘాట్ల వద్ద పూజలు, లేదా పిండ ప్రధానాలు మాత్రం చేసుకుని వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. పుష్కరాలు అంటేనే నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం.. అలాంటిది పుణ్య స్నానాలనే నిషేధించడం ఏమిటని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.