అరెస్ట్ తప్పదు.. ట్విటర్‌కు ప్రభుత్వం హెచ్చరిక

తమ ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటున్న ట్విటర్‌కు ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఆ సంస్థ ఇండియాకు చెందిన అధికారులను అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. 1178 అకౌంట్లను బ్లాక్ చేయాలని తాము గతంలో జారీ చేసిన ఆదేశాలకు సంస్థ పట్టించుకోకపోవడంపై స్పందిస్తూ.. తమ సహనం నశిస్తోందని ప్రభుత్వం అనడం గమనార్హం. సంస్థ అంతర్గత చట్టాలు ఏవైనా ఉండని.. దేశ చట్టాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.

రాజ్యాంగమే సుప్రీం

ట్విటర్ అధినాయకత్వంపై ఆ శాఖ కార్యదర్శి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఇండియాలో రాజ్యాంగం, స్థానిక చట్టాలే సుప్రీం. బాధ్యతాయుత సంస్థలు కచ్చితంగా స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ట్విటర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ మోనిక్ మెచె, డిప్యూటీ జనరల్ కౌన్సిల్ జిమ్ బేకర్‌లతో ఐటీ శాఖ కార్యదర్శి వర్చువల్ మీటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం 1178 అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించగా..

ట్విటర్ మాత్రం కేవలం 500 అకౌంట్లనే బ్లాక్ చేసింది. మిగతా అకౌంట్లను భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అలాగే ఉంచింది. అవసరమైతే దీనిపై కోర్టుకు వెళ్లాలని కూడా ట్విటర్ భావిస్తోంది.