సోషల్ మీడియా పోస్టుల పేరుతో అరెస్టులు చేయడం అప్రజాస్వామికం!

రాష్ట్రంలో చోటు చేసుకున్న దేవాలయ ఆస్తులను… విగ్రహాలను ధ్వంసం చేయడం లాంటి దుస్సంఘటనలపై సక్రమరీతిలో దర్యాప్తు చేయించలేని ప్రభుత్వం సోషల్ మీడియాలో ఆ ఘటనలపై పోస్టులు పెట్టారనే నెపంతో జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ దగ్గర లక్షీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన తోరణం విగ్రహంలోని కొంత భాగం దెబ్బ తిన్న క్రమంలో ఆ విషయం మీడియాలో వచ్చిన మాట వాస్తవం.

ఈ ఘటనపై పోస్టులు పెట్టారంటూ జనసేన కార్యకర్తలు శ్రీ తోటకూర అనిల్ (ఒంగోలు), శ్రీ నాగ మల్లికార్జున (కడప), శ్రీ దేవేంద్ర కుమార్ (విశాఖపట్నం)లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి లోపాలను, అందుకు కారకులను గుర్తించాల్సిన పోలీసు శాఖ ఆ బాధ్యతను పక్కనపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మా పార్టీవారిని ఇబ్బందిపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలతో మా కార్యకర్తల ధైర్యాన్ని తగ్గించగలం, భయపెట్టగలం అని ప్రభుత్వం భావిస్తే అది సాధ్యం కాదు అని గుర్తించాలి. తప్పకుండా ప్రభుత్వ అనైతిక చర్యలను, అప్రజాస్వామిక విధానాలను మీడియా, సోషల్ మీడియా ద్వారా మా పార్టీ ప్రశ్నిస్తుంది.