అస్సాం తదుపరి ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ..!

అస్సాం తదుపరి ముఖ్యమంత్రి ఎవరూ అన్న సందిగ్థత దాదాపుగా ఖరారైంది. తదుపరి ముఖ్యమంత్రిగా హిమాంత బిశ్వ శర్మను అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సర్బానంద సోనోవాల్‌ ఆదివారం తన రాజీనామా లేఖను గవర్నర్‌ జగదీష్‌ ముఖీకి అందించారు. ఆదివారం గువహటిలో జరిగిన సమావేశంలో శాసనసభ పార్టీ సమావేశంలో రాష్ట్ర తదుపరి సిఎంగా హిమాంత పేరును.. సోనోవాల్‌ ప్రతిపాదించాని తెలుస్తోంది. అసోంలో మే 2న వెలువడిన ఫలితాల్లో బిజెపి కూటమి గెలుపొందిన సంగతి విదితమే. అయితే ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ అనేది ఖరారు చేయలేదు. విజయం సాధించడంతో సర్బానంద సోనోవాల్‌, హిమాంతలో ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలన్న డైలమాలో అధిష్టానం ఉంది. వీరిద్దరూ కూడా పదవి తమకే దక్కాలన్న ఆలోచనలో ఉండటంతో.. ఈ విషయంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీకి పిలిపించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని అధిష్టానం పలు మార్లు సమావేశమై చివరకు హిమాంత బిశ్వ శర్మను తదుపరి ముఖ్యమంత్రి ఖరారు చేసింది.