దాసరి అరుణ్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు నమోదు.. అరుణ్‌ స్పందన

ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్‌ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. బొల్లారంలోని మారుతీనగర్‌కు చెందిన నర్సింహులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాసరి నారాయణరావు వద్ద నర్సింహులు 2012 నుంచి 2016 వరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సినిమాల రిస్టోరేషన్ పనులు చేశాడు. దాసరి మృతి తర్వాత పెండింగ్ డబ్బుల చెల్లింపులో అరుణ్‌కుమార్, ప్రభులతో నర్సింహులుకు వివాదం తలెత్తింది. అయితే, ఈ నెల 13న డబ్బులు ఇస్తామని ఇంటికి పిలిచి కులం పేరుతో అరుణ్‌కుమార్ తనను దూషించారంటూ నర్సింహులు ఇటీవల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్థిక పరమైన లావాదేవీలపై తనను బెదిరించినట్లు సోమేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

మరోవైపు ఈ వార్తలపై దాసరి అరుణ్ స్పందించారు. అసలు నర్సింహులు అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అరుణ్ చెప్పారు. ఈ విషయంపై పోలీసులు తనకు ఫోన్ చేసి అడిగారని.. ఆయన ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారని తెలిపారు. ఒకవేళ కేసు నమోదైతే పీఎస్ లో ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా? అని అన్నారు. నాన్న దగ్గర ఆ వ్యక్తి ఎప్పుడు పని చేశారో కూడా తనకు తెలియదని చెప్పారు. నాన్న సినిమాలకు తాను ఎప్పుడూ ప్రొడక్షన్ పనులు చూసుకోలేదని తెలిపారు. తనకు తెలియని వ్యక్తికి తాను డబ్బులు ఎలా ఇవ్వాలో తనకు తెలియడం లేదని చెప్పారు. ఈ వ్యవహారం వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అరుణ్ చమత్కరించారు.