బీజేపీ చీఫ్ కాన్వాయ్ పై దాడి.. దర్యాప్తునకు హోం మంత్రి అమిత్ షా ఆదేశం

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్ పై జరిగిన దాడి మీద దర్యాప్తునకు హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమగ్ర నివేదిక పంపాలని గవర్నర్ ని కోరారు. రాష్ట్రంలో పూర్తి అరాచకం ఏర్పడిందని, లా అండ్ ఆర్డర్ క్షీణించిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై 12 గంటల్లోగా రెండు రిపోర్టులు పంపాలని హోం శాఖ బెంగాల్ అధికారులను ఆదేశించింది. కోల్ కతాకు సుమారు 60 కి.మీ. దూరంలో డైమండ్ హార్బర్ లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు నడ్డా వెళ్తుండగా ఆయన కాన్వాయ్ ఫై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులుగా భావిస్తున్న గుంపు రాళ్లు. రాడ్లు, కర్రలతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు, విండో స్క్రీన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. తాను ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ అయినందున తను గాయపడకుండా తప్పించుకున్నానని, కానీ తమ పార్టీ నేతలు కైలాష్ విజయ్ వర్గీయ, ముకుల్ రాయ్ గాయపడ్డారని నడ్డా తెలిపారు. దుర్గామాత కరుణ వల్లే తాను సమావేశ స్థలానికి క్షేమంగా చేరుకోగలిగానన్నారు.

ఈ ఘటనలో కొందరు జర్నలిస్టులపై కూడా గుంపు దాడికి యత్నించింది. కాగా సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనను తేలిగ్గా కొట్టి పారేశారు. బీజేపీ కొత్త ‘హిందూ డ్రామా’కు తెర తీసిందన్నారు. నరేంద్ర మోడీ బాబు సర్కార్ ఇలాంటి డ్రామాలు సృష్టించి వీడియోగా ప్రదర్శిస్తోందని, వీటిని మీడియాకు సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ‘నౌటంకీ’ (తమాషా) జరుగుతోందని, బీజేపీ కార్యకర్తలే మారణాయుధాలతో రోజూ తిరుగుతున్నారని, వారికి సీ ఆర్ పీ ఎఫ్, బీ ఎస్ ఎఫ్ , ఆర్మీ వంటి దళాలు భద్రత కల్పిస్తున్నాయని దీదీ ఎదురుదాడికి దిగారు.