తెలుగు రాష్ట్రాల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ సంబరాలు..

అమరావతి : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో కేంద్రం సంబరాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఈ సంబరాల్లో రాష్ట్రాలన్నీ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు దేశ వ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికిగాను తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించాయి.

తెలంగాణ : తెలంగాణలోని పబ్లిక్‌ గార్డెన్‌, వరంగల్‌ పోలీసు గ్రౌండ్‌లో ఈ ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్‌, వరంగల్‌లో గవర్నర్‌ తమిళసై పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు మార్చ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌, ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ పోషించిన పాత్ర కీలకమైందని అన్నారు. స్వయం పాలనలో ఇప్పుడు అభివఅద్ధి పథకంలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. జాతీయ భావాలు పెంపొందించేలా అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి తెలంగాణ సర్కార్‌ ఏర్పాట్లు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ : ఎపి లో గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించనున్న వేడుకల్లో సిఎం జగన్‌ పాల్గొననున్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి, కుటుంబ సభ్యులను సిఎం సన్మానించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మాచర్లలో సీతామహాలక్ష్మి నివాసానికి చేరుకుని వారితో మాట్లాడతారు.