బాలు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలి

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్థం సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, ఏటా ఎస్పీబీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరుతూ ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు.

ఎస్పీ బాలు జయంతిని రాష్ట్ర పండుగ గా నిర్వహించాలని…మ్యూజిక్ వర్శిటీలో బాలు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అటు నెల్లూరులో బాలు జ్ఞాపకార్ధం సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని లేఖలో ప్రస్తావించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరిట ఓ జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేయాలని…ప్రభుత్వం సంగీత అకాడమీకు బాలు పేరు పెట్టాలని సూచించారు చంద్రబాబు నాయుడు. ఇలా చేయడం ద్వారానే బాలుకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందన్నారు.

మరోవైపు అంతర్వేది రధం గురించి పలు విషయాల్ని లేఖలో పేర్కొన్నారు. అంతర్వేది రథ నిర్మాణ పనులు అగ్నికుల క్షత్రియుల ద్వారానే జరగాలని చంద్రబాబు కోరారు. అంతర్వేది నూతన రథ నిర్మాణ పనులను టెండర్లు పిలవకుండానే అప్పగించడంపై అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయని చంద్రబాబు చెప్పారు. రధాన్ని స్వామికి ప్రతిరూపంగా భావించే అగ్నికుల క్షత్రియులే ఈ ఆలయాన్ని నిర్మించారని..నిర్వహణ కోసం 18 వందల ఎకరాల భూమి సైతం ఇచ్చారన్న సంగతి మర్చిపోకూడదన్నారు. ఆలయాన్ని నిర్మించిన అగ్నికుల క్షత్రియులే రథ మరమ్మతులు, నిర్వహణతో పాటు రథానికి తొలి కొబ్బరికాయ కొట్టడం, రథాన్ని లాగడమనేది 2 వందల ఏళ్లుగా జరుగుతోందన్నారు.