బతుకమ్మ సంబురాలు

తెలంగాణాలో ముఖ్యమైన పండగల్లో బతుకమ్మ ఒకటి. పువ్వులను పూజించడమే బతుకమ్మ పండగ విశిష్టత. చిన్న పెద్దా ఆడపడుచులందరూ కలిసి ఆడుకునే పండగ బతుకమ్మ. పండగ మొదలైన నాటి నుండి అన్నతమ్ములు తీరొక్క పువ్వులు తీసుకొస్తే అక్క చెల్లెళ్లు వాటితో అందంగా బతుకమ్మను పేర్చి ఆడతారు. ప్రతి ఏడాది అక్టోబర్ లో ఈ పండగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది అధిక ఆశ్వీయుజ మాసం వచ్చినందున బతుకమ్మ పండుగపై కొంత సందిగ్ధం నెలకొంది. కాగా ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలి అనేదానిపై తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి స్పష్టతనిచ్చింది. అక్టోబర్ 17న ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని దానికోసం ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అక్టోబర్ 24వరకు బతుకమ్మను ఎనిమిది రోజులు పేర్చి, పూజించి జానపదాలతో ఆడి నిమజ్జనం చేయాలని తెలిపింది. ఇదిలా ఉండగా ఈసారి కరోనా విజృంభణ నేపథ్యంలో బతుకమ్మ సంబురాలకు ప్రభుత్వం అనుమతిస్తుందా…లేదా అన్న సందిగ్దత ఆడపడుచుల్లో నెలకొంది.