తిరుపతిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ..

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సిట్టింగ్ ప్రజాప్రతనిధులు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పోటీ చేసే అవకాశం కల్పించడం సాధారణం. దాంతో సానుభూతి పవనాల కారణంగా వారే గెలుస్తుండడం పరిపాటి. అయితే తిరుపతి బరిలో దిగేందుకు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులు ఆసక్తి చూపలేదని సమాచారం. ఈ నేపథ్యంలో, వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తున్నారు.

గురుమూర్తి రాజకీయాలకు కొత్త కావడంతో ఆయనను గెలిపించుకోవడం వైసీపీకి అత్యంత ప్రాధాన్యతాంశంగా మారింది. అందుకే సీఎం జగన్ కూడా తిరుపతి బరిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న ఆయన తిరుపతి రానున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జగన్ ప్రచార సభ నిర్వహించే ప్రాంతాన్ని మంత్రి పెద్దిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ చైర్మన్, జిల్లా ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఇవాళ పరిశీలించారు.