దుబాయ్ రాని విదేశీ ఆటగాళ్ల వేతనంలో కోత: బీసీసీఐ హెచ్చరిక

కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించనున్నట్టు ప్రకటించిన బీసీసీఐ తాజాగా విదేశీ ఆటగాళ్లకు హెచ్చరికలు చేసింది. ఐపీఎల్‌లో ఆడేందుకు రాని విదేశీ ఆటగాళ్ల వేతనంలో కోత విధిస్తామని తెలిపింది. అయితే, బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు మాత్రం ఇది వర్తించదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబరులో నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది.

అయితే, ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండడంతో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడడం అనుమానంగానే ఉంది. చాలా దేశాలు తమ ఆటగాళ్లను విడుదల చేయడానికి విముఖత చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు.

విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం ఆడేందుకు యూఏఈ రాకపోతే వారి వేతనాల్లో కోత పెట్టే హక్కులు ఫ్రాంచైజీలకు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే వారికి చెల్లిస్తామని పేర్కొన్నారు. అయితే, బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని, 2011 నుంచి వారికి బీమా వర్తిస్తుండడంతో పూర్తి వేతనాలు అందుతాయన్నారు.