వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. మాస్కులు ధరించండి: మంత్రి ఈటల

కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రజలకు మంత్రి సూచించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, నిర్లక్ష్యం కూడదని అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని మంత్రి పేర్కొన్నారు.