Bengal Minister సుబ్రతా ముఖర్జీ మృతి

 పశ్చిమబెంగాల్‌ మంత్రి, సీనియర్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుబ్రతా ముఖర్జీ (75) గుండెనొప్పితో మరణించారు. అక్టోబర్‌లో 24న శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ముఖర్జీ చికిత్స పొందుతూ గురువారం మరణించారని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే మమతా బెనర్జీ ఆస్పత్రికి చేరుకున్నారు. సుబ్రతా ముఖర్జీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానని, ఎంతో నిబద్ధత కలిగిన నేత అని ప్రశంసించారు. సుబ్రతా ముఖర్జీ మరణం తనకు వ్యక్తిగతం ఎంతో నష్టమని, ఆయనలేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుబ్రతా ముఖర్జీ పంచాయతీ రాజ్‌ శాఖతో పాటు మరో మూడు శాఖలను పర్యవేక్షిస్తున్నారు. అక్టోబరు 24న తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో సుబ్రతా ముఖర్జీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఐసియులో చికిత్స పొందుతున్నట్లు ఎస్‌ఎస్‌కెఎం వైద్యులు వెల్లడించారు. నవంబరు 1న ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారని, గురువారం రాత్రి 9.22 నిమిషాలకు కార్డియాక్‌ అరెస్ట్‌తో సుబ్రతా ముఖర్జీ కన్నుమూశారని  బెంగాల్‌ మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ తెలిపారు.  ఈ ఏడాది  మే నెలలోనూ ఆయన తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న అనంతరం నారద ముడుపుల కేసులో ఆయనను సిబిఐ అరెస్ట్‌ చేయగా.. బెయిల్‌పై విడుదలయ్యారు.