జనసేన సిబ్బందిని పోలీసులు సోదాలు చేయడంపై భగ్గుమన్న అనుశ్రీ సత్యనారాయణ

రాజమహేంద్రవరం, మార్చి 7 : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే జనసేన సిబ్బందిపై ముఖ్యమంత్రి జగన్ పోలీసులను ప్రయోగించారని ఆ పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం రాత్రి మంగళగిరిలో జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్ లో పోలీసులు సోదాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. ఎటువంటి ఫిర్యాదులు లేకుండానే కేవలం అధికార పార్టీ మెప్పు కోసం జనసేన సిబ్బందిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల జగన్ పార్టీకి కాలం చెల్లుతుందని భయపడుతున్న వైసీపీ నాయకులు జనసేన పార్టీ వారిని పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ పార్టీలో ఉన్న వారంతా పవన్ కళ్యాణ్ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేస్తారని వైసీపీ మాదిరి అల్లరి మూకలు ఎవరూ లేరన్నారు. పవన్ పై అభిమామే జనసైనికులను సహనంతో ఉండేలా చేస్తుందని ప్రభుత్వం కవ్విస్తే జనసైనికులను కట్టడి చేయడం ఎవరితరం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని పోలీసులు ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజల కోసమే పని చేయాలని హితవు పలికారు. మరో 40 రోజుల్లో జగన్ అండ్ కో పెట్టె బేడా సర్దుకుని రాజకీయ సన్యాసం చేసే రోజులు వస్తాయన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తామని వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు.