నేడు భారత్ బంద్.. దేశవ్యాప్త ప్రతిష్టంభన, నిరసనలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, ర్యాలీలు

 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ (సోమవారం) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్‌ 27) ఏడాదైన సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ఈ బంద్‌కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ జరగనుంది.

రైతులు ప్రకటించిన బంద్‌కు కాంగ్రెస్ సహా వామపక్షాలు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. బంద్‌కు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడెరేషన్‌ కూడా మద్దతు తెలిపింది. బంద్‌ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు.