పింగళి వెంకయ్యకు ‘భారతరత్న’ ఇవ్వాలి.. ఊరూరా విగ్రహాలు నెలకొల్పాలి: పవన్ కల్యాణ్

భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పరాయి పాలన నుంచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం  భరత ఖండం సాగించిన పోరాటంలో మువ్వన్నెల జెండా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించిందని తెలిపారు. అలాంటి త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించడం సముచితంగా ఉంటుందని తెలిపారు. భారత జాతీయ పతాకం రెపరెపలు మొదలై ఇవాళ్టికి 100 సంవత్సరాలు పూర్తయిందని, ఇవి భారతీయులందరూ గర్వపడాల్సిన మధుర క్షణాలని పేర్కొన్నారు.

జాతీయ జెండా విజయవాడలోనే ఊపిరి పోసుకుందని పవన్ గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను, వీరుల త్యాగాలను భావితరాలకు చెప్పేందుకు…. వర్తమానంలో దేశ ప్రగతిని, సాధించిన విజయాలను వివరించేందుకు జాతీయ పతాకమే ఘన నేపథ్యంగా విరాజిల్లుతుందని అభివర్ణించారు. ఇంతటి విశిష్టత కలిగిన జాతీయ పతాకాన్ని జాతికి అందించిన పింగళి వెంకయ్యను దేశం ఎల్లప్పుడూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వడమే కాకుండా, ఊరూరా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.