భీమ్లానాయక్ : పవన్ ప్రోత్సహించిన తెలంగాణ కళాకారులు

పాట పాటకూ మోగు కిన్నెర
మాట మాట‌కూ మోగు కిన్నెర
మౌనంకు అర్థం వెతికిన కిన్నెర
కిన్నెర మెట్ల పాట ఆయన పాట

బ‌డి చ‌దువు చూడ‌ని పాట అని కూడా అంటారు తెలిసిన వారు. బ‌డి చూడ‌ని చ‌దువు మాత్రం ఆ పాటే కావొచ్చు.ఆయ‌నే మొగుల‌య్య. ఆయ‌న‌తో పాటు ఇంకొంద‌రు. జీవితాన్ని మార్చిన పాటతో భీమ్లా నాయ‌క్ సినిమాకో కొత్త సొబ‌గు తెచ్చారు. పూర్తి జానపద సంస్కృతిని ఓ క‌మర్షియ‌ల్ సినిమాలో నింపారు. కొన్ని మాట‌లే ప‌లికింది. పాడింది కొన్ని మాట‌లే కావొచ్చు.అవే వన్నె తెచ్చాయి. అవే ఖ్యాతికి కార‌ణం అయ్యాయి. సెబ్బాస్ రా భీమ్లా నాయ‌కా..!

అవును! ప‌వ‌న్ ఇవాళ మొగుల‌య్యనే కాదు దుర్గ‌వ్వ‌నూ ప్రోత్స‌హించారు. మంచిర్యాల దారుల్లో పాటలు పాడుకునే దుర్గ‌వ్వ‌కు కేటీఆర్ జేజేలు ప‌లికారు. దుర్గ‌వ్వ‌ను భీమ్లా నాయ‌క్ చిత్ర యూనిట్ త‌ర‌ఫున నిన్న‌టి వేళ స‌న్మానించి అభినంద‌న‌లు తెలిపింది తెలంగాణ ప్ర‌భుత్వం. వీరిద్ద‌రే కాదు ఇంకా ఇంకొంద‌రు ఉన్నారు. వారిలో ముఖ్య‌మ‌యిన వారు క‌దిరేని గూడెం ల‌క్ష్మ‌ణ్ ఏలే..బొమ్మ‌లు వేసుకునే ల‌క్ష్మ‌ణ్ అంటే ప‌వ‌న్ కు ఎంతో ఇష్టం. జానీ సినిమా స‌మ‌యంలో ల‌క్ష్మ‌ణ్ ను పిలిచి ఆయ‌న‌తో కొన్ని ఆర్ట్ వ‌ర్క్స్ చేయించారు. త‌న బ్యాన‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియెటివ్ వ‌ర్క్స్ లోగో డిజైన్ చేయించ‌డంతో స‌హా ఇంకొన్ని ఆర్ట్ వ‌ర్క్స్ చేయించారు. ఇదే స‌మ‌యంలో జానీ సినిమా టైటిల్ సాంగ్ రాయించ‌డం కోసం తెలంగాణ సంస్కృతి ముఖ్యంగా హైద్రాబాద్ న‌గ‌ర సంస్కృతి ఎంతో బాగాతెలిసిన వారి కోసం వెతికి, చివ‌ర‌కి ల‌క్ష్మ‌ణ్ స‌ల‌హా మేరకు మాస్టార్జీ అనే ప్ర‌జాక‌వితో రాయించారు. ఆ త‌రువాత ఆయన‌తో ఓ పాట‌ల ఆల్బం చేయించారు. ఆయ‌న జీవితాన్ని మార్చారు. జానీ త‌రువాత అన్న‌వరం సినిమాకు కూడా రాక్ష‌స రాజ్యం రంకెలు వేస్తూ త‌ల‌ప‌డ‌మంది తొలి యుద్ధం అన్న పాటను రాయించారు. ఆ విధంగా మాస్టార్జీ జీవితాన్నే మార్చారు. ఇంకా ప‌వ‌న్ కు ప్ర‌జా క‌వులు అంటే ఎంతో ఇష్టం.ముఖ్యంగా గ‌ద్ద‌ర్ అన్నా, వంగ‌పండు అన్నా, గోరెటి అన్నా, అందెశ్రీ అన్నా ఆయ‌నకు ఎంతో ఇష్టం. వారితో ప‌నిచేసిన దాఖ‌లాలు త‌క్కువే అయినా వాళ్ల పాటల గురించి, వారు అందించిన ఉద్య‌మ సాహిత్యం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ఉంటారు.ఆ విధంగా ప‌వ‌న్ తెలంగాణ ప‌ల్లె ప‌దుల జాన ప‌దుల జీవితాల్లో వెలుగులు నింపారు అని చెప్ప‌డం చాలా చిన్న మాట. తెలంగాణ అనే కాదు ప్ర‌తిభ ఎక్కడున్నా మోక‌రిల్లుతారు ప‌వ‌న్. వారిని చూసి అబ్బుర‌ప‌డ‌తారు. చిత్తూరు జిల్లాకు చెందిన పెంచ‌ల దాసును పిలిచి స‌త్క‌రించి ఆ క‌వినీ ఆ గాయ‌కుడ్నీ ప్రోత్స‌హించి న‌గదు పారితోష‌కం ఇచ్చి పంపారు. ద‌టీజ్ ప‌వ‌న్.

….రత్నకిశోర్ శంభుమహంతి.✍️