నేనెవరినీ నమ్మను.. తాలిబన్ల హామీలపై స్పందించిన బైడెన్‌

తాలిబన్లు తమ పాలనను గుర్తించాలని కోరుతున్నారని.. ఈ మేరకు కొన్ని హామీలు కూడా ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అయితే, వారు మాటపై నిలబడతారో.. లేదో.. చూడాల్సి ఉందన్నారు. తానెవరినీ నమ్మనని తెలిపారు. తాలిబన్లపై నమ్మకం ఉందా?అని ఆదివారం శ్వేతసౌధంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

”నేను ఎవరినీ నమ్మను. తాలిబన్లు ఓ ప్రాథమిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అఫ్గానిస్థాన్‌ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారికి సురక్షిత పాలనను అందించేందుకు కృషి చేస్తారా? గత 100 ఏళ్లలో ఏ ఒక్క గ్రూపూ చేయని ఈ పనిని వారు చేయగలరా అనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఒకవేళ దీంట్లో వాళ్లు సఫలమైతే.. ఆర్థిక, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో వారికి బయటి నుంచి సహకారం కావాల్సి ఉంటుంది” అని బైడెన్‌ అన్నారు.

తాలిబన్లు గుర్తింపు కోసం అమెరికా సహా వివిధ దేశాలను ఆశ్రయిస్తున్నారని బైడెన్ తెలిపారు. ఈ మేరకు వారు కొన్ని హమీలు ఇచ్చారన్నారు. అఫ్గాన్‌ గడ్డపై నుంచి విదేశీ రాయబార కార్యాలయాలు పూర్తిగా తరలివెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారన్నారు. ఇవన్నీ ఇప్పటి వరకు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. ఇప్పటి వరకైతే.. అమెరికా బలగాలపై మాత్రం దాడి చేయలేదన్నారు. అఫ్గానిస్థాన్‌ నుంచి వివిధ దేశాలు తమ పౌరులతో పాటు శరణార్థులను తరలిస్తున్న తరుణంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా పౌరులను తరలించేందుకు నిర్దేశించిన ఆగస్టు 31 గడువును మరికొంత కాలం పొడిగించేందుకు సైనికాధికారులతో కలిసి చర్చిస్తున్నామని బైడెన్ పేర్కొన్నారు. అలాగే కాబుల్‌ చుట్టపక్కల ప్రాంతాల్లో పరిస్థితుల్ని మరింత పటిష్ఠపరిచామన్నారు. అమెరికా సైన్యం అధీనంలో ఉన్న విమనాశ్రయ పరిసరాలతో పాటు సేఫ్‌ జోన్‌ను మరింత విస్తరించామని తెలిపారు. తద్వారా విమానాశ్రయానికి తరలిస్తున్నవారికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.